logo

రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!

కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు.

Updated : 06 May 2024 07:05 IST

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’పై సర్వత్రా ఆందోళన
ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టేందుకేనని విమర్శలు


జర భద్రం

  • కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉండే వారిని నియమిస్తే.. భూ కబ్జాలకు ఊతమిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
  • ఏదైనా ఆస్తి తమదేనంటూ తప్పుడు క్లెయిమ్‌ దాఖలు చేస్తే.. సంబంధిత ఆస్తి వివాదాస్పద(డిస్ఫ్యూట్‌) రిజిస్టర్‌లో నమోదవుతుంది. అది తేలే వరకు లావాదేవీలకు అవకాశం ఉండదు. పేదలు, నిరక్షరాస్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
  • ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు చేరితే.. మార్చడానికి వీలు ఉండదు. రిజిస్టర్‌లో పేరు చేర్చే ముందు కొందరు అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్లు చేసే అవకాశం ఉంది. రైతులు, చదువుకోని వారు వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు.
  • ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు.. ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉన్నాయి. క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం.. వాటికి విలువ ఉండదు. టీఆర్వో ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
  • అధికారులను దారిలోకి తెచ్చుకుని దేవాదాయ భూములకు యజమానిగా చేర్చుకుంటే.. పట్టించుకునేవారు ఉండరు. ఆ తర్వాత అవి అధికారి, ధన, కండ బలం ఉన్నవారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఈనాడు, నెల్లూరు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాలకూ రక్షణ లేకుండా పోయింది. రూ. కోట్ల విలువైన భూములను బెదిరించి తక్కువ ధరకే కాజేశారు. ఇరిగేషన్‌, దేవాదాయ స్థలాలనూ మింగేశారు. కాలువలను ఆక్రమించారు.. చెరువులనూ పూడ్చేశారు. నదుల రూపురేఖలను మార్చేశారు. ఇవన్నీ చాలవా అన్నట్లు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)-2023ను వైకాపా ప్రభుత్వం ప్రయోగించి.. ప్రజల స్థిరాస్తులకు ఎసరు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా ఈ చట్టం దుర్వినియోగం కానుందని, అందులోని వివిధ సెక్షన్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని న్యాయవాదులే అభిప్రాయపడుతుండటం.. సగటు సామాన్యుడిని కలవరపెడుతోంది. భూ వివాదాలను పరిష్కరించే సివిల్‌ కోర్టుల పరిధి నుంచి పూర్తిగా తొలగించి.. కనీస న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకు భూ హక్కులు నిర్ణయించే అధికారాన్ని కట్టబెట్టడం.. సొంతవారి కోసం రికార్డులు సృష్టించుకునేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రీసర్వేతో.. మొదలైందిక్కడ!

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా 737 గ్రామాల్లోని 9,096 చ.కి.మీ రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. వీటిలో 325లో పూర్తి చేసి.. 234 గ్రామాలకు భూ హక్కు పత్రాలు రైతులకు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేస్తున్నామని.. 3.66 లక్షల భూ రక్ష రాళ్లు నాటినట్లు చెబుతుండగా- దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమి కొలతలు రీసర్వేతో తగ్గించి చూపారని రైతులు, యజమానులు వాపోతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో చాలా మంది రైతులు రెండు సెంట నుంచి పది సెంట్ల వరకు కోల్పోయారు. ఎందుకు తగ్గిందో రెవెన్యూ అధికారులు చెప్పడం లేదు. కొన్నిచోట్ల రైతులకు తెలియకుండానే భూముల రీసర్వే పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల వరకు అభ్యంతరాలు వచ్చినా.. పట్టించుకోకపోవడం గమనార్హం. కందుకూరు పరిధిలో శ్రీనివాసరావు అనే రైతుకు మొత్తం 3.20 ఎకరాలు ఉండగా- రీసర్వే తర్వాత సుమారు 15 సెంట్లు తగ్గింది. అదేమిటని అడిగితే.. ఉన్నదే ఇచ్చాం.. లేనిది ఎక్కడి నుంచి తెచ్చి కలపాలంటూ దురుసుగా మాట్లాడారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

భక్షణ కొనసాగిస్తారిలా...

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను గత ఏడాది అక్టోబరు 31 నుంచి అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ చట్టంతో భూ యజమానులు, కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా కోల్పోయే పరిస్థితి ఎదురైంది. భూ వివాదాల పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా.. యజమాని స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించేలా నిబంధనలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు.. సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని, రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని కల్లబొల్లి మాటలు చెబుతున్నా.. వైకాపా ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. చట్టం అమల్లోకి వచ్చాక.. సలహాలు తీసుకోవడం ఏమిటనే విమర్శలు నెలకొన్నాయి. భూములు కొనుగోలు సమయంలో జరిగే అవకతవకలను ఇక నుంచి ట్రైబ్యునల్‌లో ప్రభుత్వం నియమించే టీఆర్వో పరిష్కరిస్తారని చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. భూముల రీసర్వే పూర్తయితే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన భూ హక్కులను హరిస్తారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


గ్రామాల్లో గొడవలకు ఆస్కారం

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఓ దుర్మార్గం. దీంతో ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదం నెలకొంటే.. ఆ ఊరిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. గొడవలు పెరుగుతాయి. రాజకీయ ఒత్తిడి, ప్రలోభాలతో కొందరు అధికారులు తీసుకునే నిర్ణయాలు.. చిన్న, సన్నకారు రైతులను రోడ్డున పడేస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నష్టపోతారు. బలవంతులు రెచ్చిపోతారు. అమాయక రైతులు నష్టపోతారు.

కె.ఎస్‌.వెంకటేశ్వర్లు, విశ్రాంత తహసీల్దారు


భూమిపై హక్కు కోల్పోయినట్లే..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోతారు. భూములకు రక్షణ ఉండదు. కొత్త చట్టంతో ఉన్న కొద్దిపాటి ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న భూ హక్కును రైతులు కోల్పోయే అవకాశం ఉంది. ఆస్తులపై యజమాని హక్కును హరించేలా రూపొందించడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.  

పువ్వాడి శంకరయ్య, న్యాయవాది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని