logo

ఊరూరా గొలుసు.. చిదిమేస్తోంది బతుకు!

ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్‌షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్‌... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు.

Updated : 07 May 2024 04:52 IST

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నిర్వహణ
సరకు తరలించి.. మధ్యాహ్నానికే దుకాణాల మూత
ఇళ్లు.. ఒళ్లు గుల్లవుతున్నా నిద్రనటిస్తున్న యంత్రాంగం
ఈనాడు, నెల్లూరు

‘ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఉందో లేదో తెలియదు గానీ.. మందుషాపు లేని గ్రామం ఉందా అని అడుగుతున్నా. ప్రతి వీధి చివరలో, ప్రతి ఇంటి ముందు షాపు పెట్టి పిల్లలను చెడగొడుతున్నారు. ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ ఇంటికి తీసుకొస్తారో లేదో తెలియదు గానీ.. మందు సీసా నేరుగా ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది’

- ఇదీ గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలు.


‘జిల్లాలోని ప్రతి ఊరిలో తక్కువలో తక్కువ రెండు, మూడు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కందుకూరు నుంచి సైదాపురం వరకు ఎక్కడ చూసినా గొలుసు దుకాణాలే కనిపిస్తున్నాయి. చిల్లర దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, బడ్డీకొట్లు, శీతల పానీయాల దుకాణాలు, కిరాణా కొట్ల మాటున విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి ఊరిలో వీటి నిర్వహణలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర కావడంతో అటువైపు చూసేవారే కరవయ్యారు.

- ఇదీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి

న్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్‌షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్‌... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. ఆయన పుట్టిన రోజు నాడే.. ‘బెల్ట్‌ దుకాణాలు’ రద్దు అంటూ పచ్చి అబద్ధం చెప్పారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు నెరవేర్చామని ఊహల్లో ఉన్న ముఖ్యమంత్రి.. బెల్ట్‌ షాపులనూ అదే కోవలో వేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఊరిలో మూడు సీసాలు, ఆరు బీర్లుగా మద్యం ఏరులై పారుతున్నా.. మన దగ్గర కాదులే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తుండగా- మద్యం అక్రమ రవాణా నియంత్రణకే ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నాలుగేళ్లుగా ఉందా? లేదా? అన్నట్లు ఉండటమే దీనికి నిదర్శనం.

ఫోన్‌ చేస్తే.. ఇంటికే..

ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. మద్యం ఒక చోట డంప్‌ చేసుకుని.. అక్కడి నుంచి ఒక్కో సీసా తెచ్చి జనాలకు విక్రయిస్తున్నారు. కందుకూరు రూరల్‌, ఆత్మకూరు, కావలి, నెల్లూరు రూరల్‌, వెంకటాచలం పరిధిలో ఫోన్‌ చేస్తే చాలు.. ఎక్కడికైనా మందు సీసాలు తెచ్చి ఇస్తారు. కందుకూరు రూరల్‌ పరిధిలో ఆరువేల మంది జనాభా ఉన్న మాచవరంలో 4 బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ దుకాణాల్లో తమ అనుచరులను అక్కడ సిబ్బందిగా నియమించుకుని పెత్తనం చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. గత ఏడాది వరికుంటపాడు మండలం విరువూరులో నాలుగు గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదు. చివరకు గ్రామస్థులు గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన చేయాల్సి వచ్చింది.

ఉదయం అరువు.. సాయంత్రం వసూలు

ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలకు అరువుపై మద్యం ఇచ్చి.. సాయంత్రం వారి వద్ద డబ్బు వసూలు చేసుకుంటున్నారు. మందుబాబులకు కావాల్సిన ఆహారం, గ్లాసులు వంటివి సరఫరా చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. మనుబోలు మండలం కొమ్మలపూడిలో మూడు గొలుసు దుకాణాలు ఉండగా- రెండు చోట్ల ఇళ్లలో, ఒకచోట చికెన్‌ దుకాణంలో విక్రయిస్తున్నారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం, జంగాలపల్లి గ్రామాల్లో 8 బెల్ట్‌ దుకాణాలు ఉండగా- మూడు చోట్ల శీతల పానీయాల మాటున, మిగిలిన ప్రాంతాల్లో గడ్డివాముల్లో నిల్వ ఉంచి అమ్ముతున్నారు. కోవూరు నడిబొడ్డున ఓ చిల్లర దుకాణంలో అధికార పార్టీ అండదండలతో నడుస్తుండగా- కందుకూరు రూరల్‌ పరిధిలోని పలుకూరులో రెండు శీతల పానీయాల దుకాణాల్లో, మరో రెండు నివాసాల్లో.. మొత్తం నాలుగు నడుపుతున్నారు. గుడ్లూరు మండలం చేవూరు, రాపూరు, పాజర్ల, మోచర్ల, నాయుడుపాలెం, పూరేటిపల్లి, కొత్తపేట, కర్లపాలెం, రాజుపాలెంలో రెండేసి బెల్ట్‌షాపులు ఉన్నాయి. పరిస్థితి ఇంతలా ఉన్నా.. అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాల్సిన సెబ్‌ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదు.


ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే...

బెల్ట్‌ షాపులకు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే మందు సరఫరా అవుతోంది. ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది గొలుసు దుకాణాల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నానికే సరకు లేదంటూ తలుపులు వేసుకుని వెళ్లిపోతున్నా.. చాలా చోట్ల ఒక్కో క్వార్టర్‌ సీసాపై అదనంగా రూ. 10నుంచి రూ.15 తీసుకుని దొడ్డిదారిలో కావాల్సినన్ని అందిస్తున్నారు. గొలుసు దుకాణదారులు వాటిని గ్రామాలకు తీసుకువెళ్లి.. ఆ ధరపై మరో 30-40వేసి, మందుబాబులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో రూ.130 ఉండే క్వార్టర్‌ సీసా.. ఇక్కడ రూ. 180కి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల అవతలివారి అవసరాన్ని బట్టి.. ఈ ధర ఇంకా పెరుగుతుంది కూడా. కొన్నిచోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందే నేరుగా బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. దీనికి నిదర్శనం.. ఇటీవల విరువూరులో దొరికిన మద్యం డంప్‌ సూరాయపాళెం, తాటిపర్తి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి పంపింది కావడమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని