logo

అందని డ్రోన్లకు అన్నదాతల ఎదురుచూపు

నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు.

Published : 08 May 2024 06:32 IST

ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం, న్యూస్‌టుడే: నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు. మందుల పిచికారికి డ్రోన్‌ ఉపయోగించడంతో మందుల పరిమాణంతోపాటు ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు రైతులకు నామమాత్రంగా అవగహన కార్యక్రమాలను నిర్వహించారు. మండలం నుంచి డ్రోన్‌ నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ఒక రైతును ఎంపిక చేశారు. కానీ, ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో డ్రోన్‌ ద్వారా పిచికారిపై డెమోలు 15 సచివాలయాల పరిధిలో అవగాహన కల్పించారు. డ్రోన్‌ విలువ అధికంగా ఉండటంతో రైతులు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.


శిక్షణకే పరిమితం

ఉలవపాడు డ్రోన్‌ పిచికారిపై ప్రభుత్వం శిక్షణలకే పరిమితమైంది. మండలానికి ఒకరిని ఎంపికచేసి.. పది రోజులపాటు శిక్షణ ఇచ్చారు. కానీ, అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. గ్రామాల్లో అక్కడక్కడా డెమో కూడా చేసి చూపించారు. అక్కడ నుంచి ప్రభుత్వపరంగా అడుగు ముందుకు పడకపోవడంతో అక్కడితో నిలిచిపోయింది. మండలానికి ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారికి డ్రోన్‌ పిచికారిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయాల్సింది. కానీ, ప్రభుత్వపరంగా డ్రోన్‌ ఏర్పాటుకు కృషి జరగలేదు.


అర్హులే లేరట,,

లింగసముద్రం మండలంలో డ్రోన్లను ఆపరేటింగ్‌ చేసేందుకు అర్హత కలిగిన విద్యావంతులు లేరనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయలేదు. పెంట్రాల, తిమ్మారెడ్డిపాలెంలో ఇద్దరిని ఎంపిక చేసినప్పటికీ వారికి సరిపడా పొలం లేక తొలగించినట్లు తెలిసింది. దీంతో మండలంలో డ్రోన్లను ఉపయోగించని పరిస్థితి.


రాయితీ శాతాన్ని పెంచాలి
నవులూరి సుబ్బానాయుడు, రైతు, పోకూరు

వలేటివారిపాలెం మండలంలో విస్తారంగా మినుము, శనగ పంటలను సాగు చేస్తుంటారు. ఈ పంటలకు నాలుగు నుంచి ఆరుసార్లు మందులు పిచికారి చేయాల్సి వస్తోంది. కూలీల డిమాండ్‌ వల్ల ట్రాక్టరు సాయంతో ప్రస్తుతం మందులను పంటలపై పిచికారి చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్ల ధరలు అధికంగా ఉండటంతో రైతులు కొనలేని పరిస్థితి. ప్రభుత్వం రాయితీ శాతాన్ని పెంచి రైతులకు అందించాలి. వాటిని వినియోగించే పరిజ్ఞానం నిరక్షరాస్యులైన రైతులకు లేకపోవడం, అధికారులు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం గాడి తప్పింది.


కలగా మిగిలింది
కె.ప్రసాద్‌, గుడ్లూరు

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఆసరాగా ఉండటానికి డ్రోన్లను వినియోగిస్తామంటూ ప్రకటనలిచ్చారు. కానీ, వాటిని మాత్రం ప్రవేశపెట్టలేదు. కొన్నిచోట్ల ఒకసారి ఎగరేసి రైతులకు ఆశచూపారు. మేము ఆరు ఎకరాల్లో కూరగాయలు, పత్తి సాగు చేస్తున్నాం. రసాయన మందులు పిచికారి చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. రైతులకు ప్రోత్సాహం కింద డ్రోన్లు ఇవ్వకపోవడం దారుణం.


ఏ పరికరాలు అందలేదు..
ఎం.మాల్యాద్రి, పెదలాటరపి

గత తెదేపా ప్రభుత్వంలో సూక్ష్మ సేద్య పరికరాలు డ్రిప్‌, స్ప్రింక్లర్లు రైతులకు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించారు. రాయితీ మీద రైతులకు వ్యవసాయ డ్రోన్లు అందలేదు. శిక్షణ కార్యక్రమాలు లేవు. రైతులకు సూచనలిచ్చేందుకు గతంలో ప్రత్యేక కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అటువంటివి లేకపోవడం బాధాకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు