logo

జగన్మాయ.. శాశ్వత భవనాలేమాయ!

అయిదేళ్ల వైకాపా పాలనలో జగన్‌ సర్కారు ఉన్నత విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అందుకు నిదర్శనం.. కందుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనాలను నిర్మించడంలో జరుగుతున్న జాప్యమే.

Published : 09 May 2024 05:50 IST

అద్దె గదుల్లోనే ఉద్యాన కళాశాల నిర్వహణ
అరకొర వసతుల మధ్య అవస్థలు
కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

ఓగూరు సమీపంలో కళాశాల నిర్వహిస్తున్న అద్దె భవనం

అయిదేళ్ల వైకాపా పాలనలో జగన్‌ సర్కారు ఉన్నత విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అందుకు నిదర్శనం.. కందుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనాలను నిర్మించడంలో జరుగుతున్న జాప్యమే. ఇందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మూడేళ్ల కిందటే జీవో జారీ చేసినా.. నేటికీ అడుగు ముందుకు పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుడ్లూరు మండలం చినలాటరపి వద్ద ఉద్యాన కళాశాల ఏర్పాటుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే అనుమతులు రాగా- ఆ మేరకు 2017-18 నుంచి ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ కళాశాల నిర్వహణ జరుగుతుండగా- మొదటి ఏడాది తరగతులకు భవనాలు లేకపోవడంతో.. తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. రెండో ఏడాది నుంచి కందుకూరు మండలం ఓగూరు సమీపంలో అద్దె భవనాల్లో కళాశాల ఏర్పాటు చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటైన ఏకైక ప్రభుత్వ ఉద్యాన కళాశాల కావడంతో.. ఏటా సీట్లు వెంటనే పూర్తవుతున్నాయి. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున.. నాలుగేళ్లకు 200 మందికిపైగా ప్రస్తుతం విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం న్యాక్‌ ‘ఎ’ గ్రేడ్‌, 2026 వరకు ఐసీఆర్‌ అక్రెడిటేషన్‌ కూడా ఉండటంతో కళాశాల మంచి ఆదరణ పొందుతోంది. కానీ, ఇక్కడి అరకొర వసతులే విద్యార్థులు, అధ్యాపకులకు ఇబ్బందిగా మారాయి.

గదులు సమకూరితే..

శాశ్వత భవనాలు ఏర్పాటైతే అవసరమైనన్ని తరగతి గదులు, ప్రయోగశాలలు సమకూరుతాయి. బాలురు, బాలికలకు విడివిడిగా వసతిగృహాలు ఏర్పాటవుతాయి. ఉద్యానశాఖకు సంబంధించిన కూరగాయల సాగు, పెంపకంలో మెలకువలను విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పంటలు వేశాం.. ఏయే రకాలు ఉన్నాయి. వాటిని ఎలా పెంచాలనే అంశాలపై ప్రయోగాత్మకంగా పట్టు సాధిస్తారు. కళాశాల ఆవరణలోనే వివిధ రకాల తోటలు సాగు చేసి.. అక్కడ చేయిస్తారు. శాశ్వత భవనాలు సమకూరితే.. ఇదంతా ఒకేచోట ఏర్పాటవుతాయి. గత ఏడాది కళాశాలను కందుకూరు నుంచి కావలి ప్రాంతానికి తరలించాలన్న ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న భవన యజమానులతో చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో తరలించడానికి వీలుపడలేదని తెలిసింది.

2021లోనే అనుమతి..

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ కావడంతో శాశ్వత భవనాలు నిర్మించాలన్న ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. దాంతో గుడ్లూరు మండలం చినలాటరిపి వద్ద సుమారు 197.54 ఎకరాలు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు కళాశాలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చి.. ఉన్నతాధికారులకు అందజేశారు. అందులో భవనాల కోసం 2021లో రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మూడేళ్లయినా ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉండిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని