logo

పుస్తకాల నిలయం.. సమస్యల వలయం

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 5 గంటల్లోపు వస్తేనే ఆచూకీ విభాగంలో కుర్చీ దొరుకుతుంది. ఆలస్యంగా వస్తే వెనుదిరగాల్సిందే. సొంత పుస్తకాలు వెంట తెెచ్చుకున్న వారు గ్రంథాలయంలోని అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు.

Published : 23 May 2024 02:45 IST

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగార్థుల ఇబ్బందులు
పాత డీఈవో కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

పఠనంలో నిమగ్నమైన అభ్యర్థులు

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 5 గంటల్లోపు వస్తేనే ఆచూకీ విభాగంలో కుర్చీ దొరుకుతుంది. ఆలస్యంగా వస్తే వెనుదిరగాల్సిందే. సొంత పుస్తకాలు వెంట తెెచ్చుకున్న వారు గ్రంథాలయంలోని అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు. ఏ మూలన చూసినా సందడిగా ఉంటోంది. నిత్యం వందల సంఖ్యలో తరలివస్తున్న అభ్యర్థుల సమస్యలపై గతంలో ‘ఈనాడు’లో రాసిన కథనాలకు స్పందించిన పాలనాధికారి సమీపంలో ఖాళీగా ఉంటున్న పాత డీఈవో కార్యాలయాన్ని కేటాయించారు. అయితే ఇందులో ఒక గదిని మాత్రమే చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటంతో ఇక్కడా స్థలం సరిపోక తిప్పలు పడుతున్నారు. కనీసం మరో రెండు గదులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

మూత్రశాలల నిర్వహణ అధ్వానం..

గ్రూప్‌- 1, 2, 3తో పాటు డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె గదుల్లో ఉంటూ గ్రంథాలయానికి వస్తున్నారు. నిత్యం 600 మందికి పైగా సందర్శిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రంథాలయం రద్దీగా ఉంటోంది. వీరి కోసం కేటాయించిన పాత డీఈవో కార్యాలయంలో 5 గదులు ఖాళీగా ఉన్నాయి. కానీ, ఒకే గదిని చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు. ఇందులో టేబుళ్లు, కుర్చీలు, అట్టలు సరిపోవడం లేదంటున్నారు. కుర్చీల కోసం కొట్లాటలు తప్పడం లేదు. మూత్రశాలలు నిర్వహణ అధ్వానంగా ఉంది. వేసవిలో కూలర్లును ఏర్పాటు చేయకపోవడంతో ఉక్కపోతతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. మహిళల కోసం ప్రత్యేక గది లేదు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే ఇక అంతే. జనరేటర్‌ సౌకర్యం కల్పించలేదు. రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించాలి. ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలు పార్కింగ్‌ చేయకుండా చూడాలి.


వసతులు కల్పించాలి
సామ్రాట్, ఉద్యోగార్థి, వేెల్పూర్‌

నేను రెండేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నా. గ్రూప్స్‌-1 కోసం సిద్ధమవుతున్నా. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్థలం లేకపోవడంతో పాత డీఈవో కార్యాలయానికి సూర్యోదయానికి ముందే వెళ్తున్నాం. లేదంటే కుర్చీలు దొరకవు. మిగతా గదులను సైతం అందుబాటులోకి తెచ్చి టేబుళ్లు, కుర్చీలు, అట్టలు సమకూర్చాలి. ఆచూకీ విభాగం ఇక్కడా ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షల మ్యాగజైన్లను ఉంచాలి. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.


గతంలోనే ప్రతిపాదనలు
బుగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని విస్తరించేందుకు, కొత్త భవన నిర్మాణం కోసం గతంలోనే ప్రతిపాదనలు రూపొందించాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. వారి వినతి మేరకు జిల్లా పాలనాధికారి పాత డీఈవో కార్యాలయ స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయించారు. అక్కడా అవసరమైన  వసతులు కల్పించాం. పెరుగుతున్న ఉద్యోగార్థుల కోసం మిగతా గదులను సైతం అందుబాటులోకి తెస్తాం.

అందుబాటులో ఉన్నవి

ఆచూకీ విభాగం  14,150 పుస్తకాలు
అరువిచ్చే విభాగం  62,540 పుస్తకాలు 
అరువిచ్చే విభాగంలో సభ్యత్వాలు  80154 
రోజువారి పాఠకులు  600 మందికి పైగానే..
మ్యాగజైన్లు, పుస్తకాలు  13,125 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు