logo
Published : 02/12/2021 05:47 IST

కొత్త వారిని కొనసాగనివ్వట్లేదు

సమన్వయంతోనే మార్పు సాధిస్తాం

తెవివి ఉపకులపతి రవీందర్‌ గుప్తా

ఈనాడు, నిజామాబాద్‌

‘తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు ముగింపు పలికాం. తెరపైకి వస్తున్న వివాదాలకు పరిష్కారాలు కనుగొంటున్నాం. కొత్తవారిని ఉద్యోగాల్లో కొనసాగనివ్వట్లేదు. నిబంధనల అతిక్రమణకు అవకాశం ఇవ్వట్లేదు. పరిపాలనకు అవసరమైన అవగాహన పెంపొందించుకున్నా. గ్రూపుయిజంతో కొంత సమస్యలున్న మాట వాస్తవమే. అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పాం. మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెవివి ఉపకులపతి దాచేపల్లి రవీందర్‌ గుప్తా తెలిపారు. ‘ఈనాడు’ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

ఈనాడు: అక్రమ నియామకాల వివాదం ముగిసినట్లేనా?

వీసీ రవీందర్‌: ఇటీవల జరిగిన నియామకాలు నిబంధనలకు విరుద్ధమని పాలకమండలి తీర్మానించింది. దీంతో కొత్తవారిని ఉద్యోగాల్లో కొనసాగనివ్వట్లేదు. ఆ వివాదం ఇప్పటికే ముగిసింది. ప్రభుత్వ, పాలకమండలి అనుమతి లేకుండా ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోం. అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తాం. అవసరమైతే ఉన్నతస్థాయిలో తెలుసుకున్నాకే అమలు చేస్తాం.

సంతకాలపై నాన్చుడు ధోరణి ఎందుకు?

పరిపాలన విభాగం నుంచి వచ్చే దస్త్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. కొన్నింటి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే రెండు రకాల సమాచారం ఉంటుంది. దాన్ని నిర్ధారించుకొని సంతకం చేయాలి. అకడమిక్‌ కన్సల్టెంట్లకు వేతన సవరణ అమలు విషయంలో ఇదే జరిగింది. తాము రెగ్యులర్‌ కోర్సులకు బోధించే వాళ్లమని, జీవో 11 అమలు చేయాలని వారు అంటున్నారు. నా దగ్గరకు వచ్చిన దస్త్రంలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల వారికి వర్తించే జీవో 141 ప్రకారం చేయాలని ఉంది. అందుకే ఆలస్యం జరిగింది. ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ నుంచి వివరాలు తెప్పించి చూడాల్సి ఉంది.

సర్వీసు రిజిస్టర్ల పంచాయితీపై ఏమంటారు?

ముగ్గురు ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను పూర్వ రిజిస్ట్రార్‌ తీసుకెళ్లి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం ఉంది. వాటిని ఎందుకు తీసుకున్నారని కారణం అడుగుతున్నారు. వర్సిటీ బయటకు తీసుకెళ్లారని పలువురు ఆరోపిస్తున్నారు. అజెండాలో లేనప్పటికీ దీనిపై శనివారం పాలకమండలిలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలో ప్రస్తుత రిజిస్ట్రార్‌కు కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు. ఇలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు కొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

ఉద్యోగులకు శిక్షణ అంటున్నారు.. నైపుణ్యాలు లేవంటారా?

పొరుగు సేవల్లో భాగంగా చాలాకాలం క్రితం నియమితులయ్యారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. కొందరిలో కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. విశ్వవిద్యాలయం కార్యకలాపాల నిర్వహణలో వీరి పనితనం కీలకం. ఈ క్రమంలోనే నైపుణ్యాలు పెంపొందించాలని నిర్ణయించాం. జనవరిలో శిక్షణ ఇప్పించి పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతిభ ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తాం.

పరీక్షల ఫలితాల్లో ఆలస్యానికి కారణాలేంటి?

కరోనాతో ఏడాదిన్నరగా పరీక్షల నిర్వహణలో సమస్యలు ఎదురయ్యాయి. అన్ని ఒకేసారి నిర్వహించాల్సి వచ్చింది. డిగ్రీ కోర్సుల్లో 5, 6 సెమిస్టర్లు బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులతో కలిపి రాష్ట్రంలోనే మొదటగా ఫలితాలు విడుదల చేశాం. పీజీ ల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ముందుగా ఇచ్చాం. మిగతా కోర్సులకు సంబంధించి మూల్యాంకనం తుది దశకు చేరింది. వారం రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రవేశపెట్టేందుకు పాలకమండలి అనుమతించింది. ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే సమస్య ఉండదు.

బోధన సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తారు?

వర్సిటీలో 70 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ గుర్తించింది. ఈ మేరకు నియామకాలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేసే దిశగా ఆలోచిస్తుంది. కొన్ని విభాగాల్లో తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని