logo

నివాసంలోనే నిరవధిక దీక్ష

నియోజకవర్గంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భాజపా నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు.

Published : 29 Sep 2022 03:21 IST

మద్దతు తెలిపిన పలువురు నాయకులు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

వెంకటరమణారెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి

నియోజకవర్గంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భాజపా నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. రామారెడ్డి ఠాణా నుంచి కామారెడ్డిలోని ఆయన నివాసానికి చేర్చగా అక్కడే దీక్షకు పూనుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా పక్షాల ప్రతినిధులు, రైతులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి వచ్చి మద్దతు ప్రకటించారు.

విలువైన భూములు కాజేస్తున్నారు : మాజీ ఎంపీ వివేక్‌
రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను కల్వకుంట్ల కుటుంబం కాజేస్తోంది. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రెవెన్యూ దందాకు తెరలేపారు. 30 నుంచి 50శాతం కమీషన్లు తీసుకుని   సీఎం కేసీఆర్‌ కుటుంబీకులు భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాల్లో ప్రస్తుతం కమీషన్‌ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరణి పోర్టల్‌లో చిక్కులు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ధరణి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమవుతాం.

నేడు ఈటల రాజేందర్‌ రాక
దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ జిల్లాకేంద్రానికి గురువారం ఉదయం 9 గంటలకు రానున్నారు. రమణారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయణ్ను పరామర్శించనున్నారు.

‘కలెక్టర్‌ స్పందించాలి’
కామారెడ్డి పట్టణం: రైతుల కోసం ఆమరణ దీక్షకు దిగిన వెంకటరమణారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పేర్కొన్నారు. కలెక్టర్‌ స్పందించి ధరణి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. దీక్షా శిబిరం వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయబద్ధంగా చేస్తున్న పోరాటానికి వివిధ వర్గాలు, రైతులు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల భరత్‌, నగర అధ్యక్షుడు విపుల్‌జైన్‌ తదితరులున్నారు.


వైద్యుల పర్యవేక్షణ

ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

వెంకటరమణారెడ్డి నీరు, ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యులు గంటగంటకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు నెలకొంటున్నాయని వైద్యులు వెల్లడించారు. రైతుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రమణారెడ్డి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని