logo

చిన్న ప్రాణి... తీస్తోంది ప్రాణం..

నిజమే పలుకులో రెండక్షరాలు. పరిమాణంలో సూక్ష్మం. కానీ దాని సూదుల్లాంటి కాట్లకు ఎవరైనా కుదేలవ్వాల్సిందే. ఆ ఏముందిలే! అని తేలిగ్గా తీసేసేవారు ఆ గాయాలు అనుభవించిన వారిని అడిగితే తెలుస్తుంది

Published : 20 Aug 2023 05:47 IST

నేడు ప్రపంచ దోమ నియంత్రణ దినం
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

25,000 కోట్లు...

2016లో ఒక అధ్యయన నివేదిక ప్రకారం భారత్‌లో  దోమలు మోపుతున్న ఆర్థిక భారం..
గల్లీ చిన్నది... గరీబోళ్ల కథ పెద్దది... ఈ పాట గుర్తుంది కదా!
ఈ పాటను దోమ చిన్నది... అది చేసే నష్టం పెద్దది అని రాసుకుని పాడాల్సిందే.

నిజమే పలుకులో రెండక్షరాలు. పరిమాణంలో సూక్ష్మం. కానీ దాని సూదుల్లాంటి కాట్లకు ఎవరైనా కుదేలవ్వాల్సిందే. ఆ ఏముందిలే! అని తేలిగ్గా తీసేసేవారు ఆ గాయాలు అనుభవించిన వారిని అడిగితే తెలుస్తుంది వాటి తీవ్రత. చెంతనే ఉంటూ చేటు చేస్తున్న వాటిపై అవగాహన పెంచడానికి ప్రపంచ దోమ నియంత్రణ దినం ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తున్నారు. ఆడ ఎనాఫిలిస్‌ దోమతో మలేరియా సోకుతుందని రొనాల్డ్‌ రోస్‌ కనుగొన్న సందర్భంగా దోమలపై అవగాహన పెంచడానికి ప్రత్యేక రోజు కేటాయించారు.

దోమ కుట్టినప్పుడు చేతిపై చిన్న దురద... మహా అయితే స్వల్ప వ్యవధిలో కనిపించే దద్దుర్లు మినహా మరేది గుర్తుండదు. కానీ ఆ కాటుతో ఏర్పడే ఆర్థిక భారం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.

నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్న పుర పారిశుద్ధ్య సిబ్బంది


ఇలా  చేస్తే...

వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే కీటకాలను నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన మూడు కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉన్నాయి.

ఆదివారం పది గంటలకు పది నిమిషాలు.... ఇది పురపాలక శాఖ నిర్ణయించిన కార్యక్రమం. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తే దోమల నిల్వకు, ఉత్పత్తికి ఆస్కారముండదు.

ఫ్రైడే డ్రైడే... ప్రతి శుక్రవారం ఇంట్లో నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి పాత్రలు, తొట్లను ఆరబెడితే దోమ లార్వా ఉంటే తొలగిపోతుంది. దోమల వృద్ధి నిలిచిపోతుంది.

పునరాలోచన దినం... ప్రతి నెల చివరి శనివారం పునరాలోచన దినం పాటించాలని పురపాలక శాఖ సూచించింది. ఆ రోజు ఒక్కసారి ఇంట్లో పాత వస్తువులు బయట పడేయడానికి పూనుకుంటే...  చెత్త తొలగి దోమలు మరుగయ్యే చోటు ఖాళీ ఏర్పడుతుంది.


ఆర్థికంగా ఎలా భారం పడుతుందంటే...?

అన్ని రకాల దోమలు కుట్టినప్పుడు తొలుత వచ్చేది జ్వరం. దాని తీవ్రత ఆధారంగా వైద్యానికి వెళుతుంటాం. అప్పుడు జిల్లాలో ఖర్చులు ఇలా...


ఆస్పత్రికి వెళ్లడానికి   ఖర్చు : రూ. 200 (ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అదనం)


వైద్యుల ఫీజు :  రూ. 300-400


రక్తపరీక్షలు : జ్వర లక్షణాలను బట్టి మలేరియాకు రూ. 150, ప్లేట్‌లెట్స్‌ రూ. 300, డెంగీ ర్యాపిడ్‌ టెస్ట్‌ రూ. 600,  సీబీపీ రూ. 150


డెంగీలో ప్లేట్‌లెట్స్‌ నెల వరకు కనీసం నాలుగుసార్లు పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఇక డెంగీ నిర్ధారణకు శాస్త్రీయమైన ఎలీసా పరీక్ష ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలోనే ఉంది. ప్రైవేటులో ఒక పరీక్షకు రూ. 5000 అవుతుంది.


చికిత్స : మలేరియా సాధారణ స్థాయిలో అయితే  రూ. 500-1000


డెంగీ : రూ. 5000-10,000. రక్త ఫలకలు    అవసరమైతే ఒక్క యూనిట్‌కు రూ. 2500. ఆస్పత్రిలో చేరితే అది రూ. 2 లక్షలకు పైగానే


చికున్‌ గున్యా : రూ. 1000-10,000 కీటక జనిత వ్యాధులతో చికిత్సకు స్థాయిని బట్టి  రూ.1000-10,000 వరకు సాధారణ వ్యయం అవుతుంది. అదే పరిస్థితి చేయిదాటితే మాత్రం రూ. లక్షల్లో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని