logo

మరో ఇద్దరు

కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం వెల్లడైంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావు బరిలో దిగనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అయిదు స్థానాల్లో అభ్యర్థులు తేలగా..నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలను మరోసారి వాయిదా వేశారు.

Published : 28 Oct 2023 05:38 IST

ఈనాడు, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం వెల్లడైంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావు బరిలో దిగనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అయిదు స్థానాల్లో అభ్యర్థులు తేలగా..నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలను మరోసారి వాయిదా వేశారు. కాగా నిజామాబాద్‌ ఎంపీగా రెండుసార్లు గెలిచిన మధుయాష్కి గౌడ్‌ హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ , పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి మార్చిలో పదవీ విరమణ చేసిన కేఆర్‌ నాగరాజు వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గాల టికెట్లు దక్కించుకున్నారు.

  • అయిదు ఓసీలకేే.. ఇప్పటి వరకు ప్రకటించిన అయిదు స్థానాల్లో ఓసీలకే అవకాశం దక్కింది. వీరిలో నలుగురు రెడ్లు, ఒకరు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అర్బన్‌ నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనతో ఉన్నట్లు రెండురోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా బీసీ సామాజికవర్గానికి ఏదో ఒకచోట సీటు కేటాయించి తీరాలనే డిమాండ్‌ పార్టీ నాయకుల నుంచి వినవస్తోంది. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వని స్థానాల విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచన ఏ విధంగా ఉండబోతుందనేది మూడో జాబితా వచ్చాకే తేలనుంది. మరోపక్క ఇటీవల భారాసను వీడిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తాజాగా సొంతగూటికి చేరారు. ఆమె అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. బాన్సువాడ టికెట్‌ ఆశిస్తున్న ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. ఆయన చేరిక, పోటీ చేసే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
  • అనేక మలుపులు.. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్‌ అలీ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. రెండో జాబితాలో స్పష్టత రాలేదు. నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ ఆశించి..కొంతకాలం ప్రచారం చేసిన నగేష్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆశావహుల నడమ గట్టి పోటీ కొనసాగిన ఎల్లారెడ్డి స్థానాన్ని మదన్‌మోహన్‌రావుకు కేటాయించారు. సుభాష్‌రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. తన ఆలోచనలో మార్పు లేదని..పోటీలో ఉంటానని ఆయన చెబుతున్నారు.

అభ్యర్థుల బయోడేటా

  • నియోజకవర్గం: నిజామాబాద్‌ రూరల్‌
  • అభ్యర్థి: డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి

ఎముకల చికిత్స వైద్యుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెరాస వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తొలినాళ్లలో పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి..టికెట్‌ ఆశించినప్పటికీ రాలేదు. కొంతకాలానికే తిరిగి  తెరాసలోకి వచ్చేశారు. 2009-2014 వరకు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం తెరాస ఇన్‌ఛార్జిగా కొనసాగారు. 2016లో స్థానిక సంస్థల  శాసనమండలి స్థానానికి తెరాస తరఫున బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సందర్భంలో తెరాసను వీడి, కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 60 వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

  • నియోజకవర్గం: ఎల్లారెడ్డి
  • అభ్యర్థి: మదన్‌ మోహన్‌ రావు

ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ చదివి, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయగా భారాస ఎంపీ బీబీ పాటిల్‌ చేతిలో ఆరువేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యదళంలో ముఖ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మదన్‌ మోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డిలోని నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా, ప్రజలకు ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిత్యం ఉచిత భోజనం, కొవిడ్‌ సమయంలోనూ ప్రజలకు సేవలందించారు.

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని