logo

చిట్‌ఫండ్‌ పేరిట మోసం

చిట్‌ఫండ్‌ పేరిట సభ్యులను మోసం చేసే ప్రయత్నం చేసిన నలుగురు నిర్వాహకులను కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 16 Apr 2024 06:17 IST

రూ.2 కోట్ల మేర టోకరా వేసే ప్రయత్నం

చిట్‌ఫండ్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్న కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: చిట్‌ఫండ్‌ పేరిట సభ్యులను మోసం చేసే ప్రయత్నం చేసిన నలుగురు నిర్వాహకులను కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఎస్‌.ఎల్‌.వి.ఎస్‌. చిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఏర్పాటు చేసిన చిట్‌ఫండ్‌ కంపెనీ యజమానులైన బిల్ల దశరథ్‌రెడ్డి (ప్రభుత్వ ఉపాధ్యాయుడు), ఆయన భార్య పద్మావతి, కొడుకు నితీష్‌రెడ్డిలతో పాటు బిల్ల అచ్యుత్‌రెడ్డిలను రిమాండ్‌కు తరలించారు. బాధితుడు అహ్మద్‌ మొహియుద్దీన్‌ వీరి చిట్‌ఫండ్‌ కంపెనీలో రెండు చీటీలు వేశారు. చీటీల గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు కంపెనీ యజమానులను సంప్రదిస్తే అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపుతామని బెదిరింపులకు దిగారు. వారిపై రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ దగ్గర కూడా అనేకమంది ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇలా సుమారు 25 నుంచి 30 మంది వరకు చీటీ సభ్యులకు సంబంధించిన సుమారు రూ.2 కోట్ల మేర మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న బాధితుడు మొహియుద్దీన్‌ ఈ నెల 14న సదరు చిట్‌ఫండ్‌ కంపెనీ యజమానులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితులను విచారించి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ చిట్‌ఫండ్‌ కంపెనీని కామారెడ్డి జిల్లాకేంద్రంతో పాటు సికింద్రాబాద్‌ శివారులోని కొంపల్లి, నిజామాబాద్‌, ఆర్మూర్‌, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌, షాద్‌నగర్‌, మెట్‌పల్లి, వనపర్తి ప్రాంతాల్లో ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసులు చిట్‌ఫండ్‌ యజమానుల నుంచి కారుతో పాటు అయిదు చరవాణులు, చీటీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీ బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని