logo

గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?

వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.

Updated : 20 Apr 2024 06:54 IST

 సీసీ పనులకు నోచుకోని నీలా మాటుకాల్వ

 

 రెంజల్‌ మొండి వాగు నుంచి నీలా చెరువులోకి వెళ్లే మాటుకాల్వ సీసీపనులు నిలిచిన ప్రాంతం ఇదే..

న్యూస్‌టుడే, రెంజల్‌: వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో ఏటా ఆయకట్టు రైతాంగానికి నీటి కటకట తప్పడం లేదు. ప్రభుత్వం ఒక్కసారి శాశ్వత పరిష్కారం చూపితే రెంజల్‌ మండలం నీలా శివారులోని ఏడు గొలుసుకట్టు చెరువులు నిండి కర్షకులకు ప్రయోజనం కలుగుతుంది. అయినా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల కల సాకారం కావడం లేదు. రెంజల్‌ సమీపంలోని మొండివాగు ద్వారా వెళ్లే వృథా నీరు కందకుర్తి వద్ద హరిద్రా నదిలో కలుస్తుంది. ఈ నీటిని మాటుకాల్వ ద్వారా మళ్లిస్తే నీలాలోని గొలుసుకట్టు చెరువులు నిండే అవకాశం ఉంది. గత కాంగ్రెస్‌ హయాంలో అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి కొంతమేరకు నిధులు మంజూరు చేసి మాటుకాల్వ వద్ద షట్టర్లు, అలుగు మరమ్మతులు చేయించారు. దీంతో కొన్నాళ్ల పాటు రైతాంగానికి ప్రయోజనం కలిగినా ఆ తర్వాత పట్టించుకునే వారు కరవై నీలా గొలుసుకట్టు చెరువు ఆయకట్టు ప్రశ్నార్థకమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాటుకాల్వ సీసీ లైనింగ్‌ పనులకు నీటిపారుదల శాఖ ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేశారు. కొద్ది మేరకే సీసీ లైనింగ్‌ పనులు చేపట్టిన గుత్తేదారు తర్వాత నిలిపివేశారు. సీసీ లైనింగ్‌కు నోచుకోని మాటుకాల్వ పిచ్చి మొక్కలు, నాచుతో నిండిపోయి గొలుసుకట్టు చెరువులకు నీరు చేరడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాటుకాల్వను పరిశీలించి సీసీ లైనింగ్‌ పనులకు నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ మాటుకాల్వ సీసీ లైనింగ్‌ పనులు పూర్తయితే నీలాలోని ఏడు గొలుసుకట్టు చెరువులు నిండి సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని