logo

పోరు.. ఇక హోరు

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి

Updated : 23 Apr 2024 07:30 IST

అగ్రనేతల ప్రచారంతో వేడెక్కనున్న రాజకీయం

 ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 24న కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు మూడు పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల అగ్రనేతలను ఆహ్వానిస్తున్నారు.

 25న బాన్సువాడకు అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా ఈ నెల 25న బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న భాజపా ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులను సైతం పలు సభల్లో పాల్గొనాలని కోరింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రధాని మోదీ సభ నిర్వహించేందుకు నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జాతీయ నాయకుల పర్యటనలు ఉండేలా చూసుకుంటోంది.

సీఎంతో కాంగ్రెస్‌ సభలు

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుమీద ఉన్న కాంగ్రెస్‌ లోకసభస్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 26న జహీరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సభలు నిర్వహించనున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సైతం సభలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా మంత్రులు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కలతో పాటు ఇతర నేతల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పాల్గొనే సభల షెడ్యూల్‌ ఖరారు కానుంది.

మే 7న కామారెడ్డిలో కేసీఆర్‌ రోడ్‌ షో

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో విజయం సాధించిన భారాస ఈసారి కూడా గెలుపొందాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ సామాజికవర్గాల వారీగా ప్రజలను కలుస్తూ భారాసను గెలిపించాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు హామీల అమలులో వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెల 7న కామారెడ్డిలో అధినేత కేసీఆర్‌ రోడ్‌షోను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలతో పాటు అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌లలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని