logo

ఆదిలోనే ఆశాభంగం

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను నమ్ముకొని వచ్చే ఆమ్‌చూర్‌ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు.

Published : 06 May 2024 04:47 IST

ఆమ్‌చూర్‌ ధర గతేడాది కంటే దిగదుడుపే
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

నిజామాబాద్‌ యార్డులో ఆమ్‌చూర్‌

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను నమ్ముకొని వచ్చే ఆమ్‌చూర్‌ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు. గతేడాది నమూనా ధర రూ. 25 వేలకు పైగా కొనసాగింది. గరిష్ఠ ధరలు రూ.39 వేల వరకు వెళ్లాయి. పరిస్థితిని సాగుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

దిగుబడి పెరగడమే కారణం

మామిడి కాయను ఒలిచి పీచుగా మార్చి ఆమ్‌చూర్‌ తయారుచేస్తారు. దక్షిణ భారతంలో వంటల్లో చింతపండు ఎలా వాడతారో ఉత్తరాదిన ఈ ఆమ్‌చూర్‌ను వినియోగిస్తారు. గల్ఫ్‌, యూరప్‌ దేశాలకు దీన్ని ఎగుమతి చేస్తారు. పంట క్రయవిక్రయాలకు హైదరాబాద్‌తో పాటు అక్కడక్కడ మార్కెట్లు ఉన్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండిన పంట ఎక్కువగా ఇక్కడికే తెచ్చి అమ్ముతారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లోని వ్యాపారులు దీని ఎగుమతుల్లో అనుభవం ఉండటంతో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో ఇక్కడికి వస్తున్నారు. ఈ సారి మామిడి దిగుబడులు గణనీయంగా ఉన్నాయి. దీంతో కాయకు అంతగా డిమాండ్‌ లేకుండాపోయింది. అది ఆమ్‌చూర్‌పై పడింది. దీనిని పండించేవారికంటే కౌలుదారులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వడగాల్పులు వచ్చి పిందె రాలిన, మార్కెట్‌లో కాయకు డిమాండ్‌ తగ్గిన వీరు నష్టపోయే అవకాశం ఉంది.

క్వింటా రూ. పాతిక వేలొస్తేనే..

ఆమ్‌చూర్‌ పంటను విక్రయిస్తే క్వింటా రూ.పాతిక వేల ధర వస్తేనే గిట్టుబాటవుతుందని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్‌ యార్డులో గత వారం రోజులుగా పంట రావడం మొదలైంది. ఇప్పుడిప్పుడే వంద నుంచి 500 క్వింటాళ్ల వరకు వస్తోంది. మరో వారం ఆగితే 5 వేల క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రారంభ ధర రూ. 8,500 నుంచి మొదలై రూ.30 వేల లోపే ఆగిపోతోంది. గతేడాది దిగుబడులు తక్కువగా ఉన్న నేపథ్యంలో గరిష్ఠ ధరలు రూ.39 వేల వరకు వెళ్లడం విశేషం. ఈసారి నమూనా ధర రూ.20 వేల లోపే ఉంటోంది. దీనిపై మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి వెంకటేశంను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పంట తొలుత పచ్చిగా వస్తోందని, తేమ లేకుండా చేస్తే రానున్న రోజుల్లో ధర పెరిగే వీలుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని