logo

ప్రైవేటు బడులు.. నిబంధనలకు నీళ్లు

అధికారులంతా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. సాధారణ బడుల నుంచి కార్పొరేట్‌ పాఠశాలల వరకు యాజమాన్యాలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి.

Updated : 08 May 2024 07:08 IST

 అనుమతులు లేకుండానే ప్రవేశాలు

 నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: అధికారులంతా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. సాధారణ బడుల నుంచి కార్పొరేట్‌ పాఠశాలల వరకు యాజమాన్యాలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. జిల్లాలో కొత్త బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నెల రోజుల్లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ అనుమతి లేకుండానే ప్రవేశాలకు తెరలేపాయి. అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయడంతో గతేడాది ముగింపు దశలో పలు విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసి హోర్డింగులు తొలగించారు. సదరు యాజమాన్యాలు నోటీసులను బేఖాతరు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

పదుల సంఖ్యలో ప్లేస్కూళ్లు..

ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు సైతం అనుమతులు తీసుకోవాలని 2015లోనే ప్రభుత్వం సూచించింది. కానీ నగరంలో పదుల సంఖ్యలో ప్లేస్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగతున్నాయి. కొన్ని నర్సరీ, ఎల్‌కేజీ నిర్వహిస్తామని ఐదో తరగతి, కార్పొరేట్‌ సంస్థలు ఎనిమిదో తరగతి వరకు అనుమతి తీసుకొని పది వరకు కొనసాగిస్తున్నాయి. అయితే విద్యార్థులకు బోనాఫైడ్‌ మాత్రం మూతపడిన పాఠశాల పేరుతో ఇస్తుండటం కొసమెరుపు.

నామమాత్రపు తనిఖీలు

విద్యాసంవత్సరం ఆరంభంలోనే తనిఖీలు చేసి అనుమతులు లేని బడులను కట్టడి చేయాల్సిన అధికారుల పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులు తనిఖీలు చేసి ముడుపులతో మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. తీరా వాటిల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.

కళాశాలలది ఇదే తంతు..

పలు కార్పొరేట్‌ కళాశాలలు ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఎక్కడో వచ్చిన ర్యాంకుల్ని ఎరగా వేసి ప్రవేశాలకు తెరలేపాయి. ఆయా కళాశాలలకు చెందిన ఫైల్స్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు వద్దకు రాలేదని ఇటీవల జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికైనా అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వెలసిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
-  దుర్గాప్రసాద్‌, డీఈవో, నిజామాబాద్‌

అనుమతిలేకుండా పాఠశాలలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవు. మా దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని చేర్చేటప్పుడు సంబంధిత పాఠశాల యాజమాన్యాన్ని అనుమతిపత్రం ఉందా? లేదా? కనుక్కోవాలి.

జిల్లాలోఇదీ పరిస్థితి

ప్రైవేటు బడుల ఏర్పాటుకు సంబంధించి అన్ని వసతులు కల్పించి, ఏటా డిసెంబర్‌లోపు ప్రభుత్వానికి చలానాలు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే కొత్త పాఠశాలలు నెలకొల్పి ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు బడుల్లో 24 ప్రాథమిక, 229 ప్రాథమికోన్నత, 221 ఉన్నత పాఠశాలలున్నాయి.
వినాయక్‌నగర్‌లో అనుమతి పొందిన ఓ పాఠశాలను కంఠేశ్వర్‌కు మార్చేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. నిబంధలకు ఉల్లంఘిస్తూ ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మచ్చుకు కొన్ని...

  • హైమద్‌పుర కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాల ఫంక్షన్‌హాలులో నిర్వహిస్తున్నారు. న్యాల్‌కల్‌ రోడ్డులోనూ ఓ పాఠశాల అనుమతి లేకుండా కొనసాగుతోంది.
  • వినాయక్‌నగర్‌, కంఠేశ్వర్‌, సుభాష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పలు బడులు వెలిశాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు