logo

బరువు పేరిట వడ్లు కాజేత

కరవు పరిస్థితులను అధిగమించి ఎలాగోలా వరి పంటను బతికించుకొని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు చివరికి నిరాశే మిగులుతోంది.

Published : 08 May 2024 06:51 IST

మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన రైతులు స్థానిక కొనుగోలు కేంద్రంలో ఈ నెల ఒకటో తేదీన 703 బస్తాల ధాన్యాన్ని విక్రయించారు. సదరు ధాన్యం లారీలో రైస్‌మిల్లుకు చేరుకోగానే ట్రక్‌షీట్‌లో 16 బస్తాలు తగ్గించి 687 సంచులుగా నమోదు చేశారు.
న్యూస్‌టుడే, మాచారెడ్డి: కరవు పరిస్థితులను అధిగమించి ఎలాగోలా వరి పంటను బతికించుకొని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు చివరికి నిరాశే మిగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక సంచి బస్తాలో 40 కిలోల ధాన్యం తూకం వేయాలి. కానీ తరుగు పేరిట, తేమశాతం సరిగ్గా లేదని సొసైటీ నిర్వాహకులు సంచి బస్తాకు 40 కిలోలకు అదనంగా 2 కిలోల 200 గ్రాములు ఎక్కువనే తీసుకొంటున్నారు. రైతులు ఒప్పుకొని రైస్‌మిల్లులకు వడ్లను పంపితే లారీలను రెండు మూడు రోజుల వరకు దింపుకోవడం లేదు. వడ్ల బరువు తగ్గిందని కారణం చూపుతూ లారీ లోడ్‌లో 2 నుంచి 18 సంచుల వరకు కోత విధిస్తున్నారు. ఈ ఘటనలు మాచారెడ్డి మండలకేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నాయి. రైస్‌మిల్లుల వద్ద వడ్ల బస్తాలు తగ్గించడంపై రైతులు సొసైటీ నిర్వాహకులను అడిగితే.. ‘మాకేం తెలుసు.. రైస్‌మిల్లు వారిని అడగండి’ అని సమాధానం చెబుతున్నారు. రైస్‌మిల్లులో అడిగితే సొసైటీ వాళ్లను అడగమని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 మిగిలింది మౌనమే..

 రైస్‌మిల్లుల వద్ద లారీలో సంచుల కోత విధిస్తున్నా.. వేసవిలో ఎండలో తిరగలేక నిస్సహాయ స్థితిలో రైతు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తరుగు, బరువు పేరిట ధాన్యం విక్రయంలో తగ్గింపు చేయడం లేదని చెప్తున్నా.. కింది స్థాయి నిర్వాహకులు రైతులను దగా చేయడం మానడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

తేమశాతం ప్రకారం కొనుగోలు చేస్తున్నాం

లారీ లోడ్‌లో వడ్ల బస్తాలు తగ్గడం మా దృష్టికి వచ్చింది. తేమశాతం ప్రకారం వడ్లను కొనుగోలు చేస్తున్నాం. రైతులు ఒప్పుకొంటేనే సంచికి 42 కిలోల 200 గ్రాములు తూకం వేస్తున్నాం. లారీలు సమయానికి రాక కల్లాల్లో రెండు రోజులు వడ్లు ఉంటున్నాయి. కూలీలు లేక వడ్లు దింపుకోవడానికి ఆలస్యమవుతోందని రైస్‌మిల్లు యాజమాన్యం చెబుతున్నారు. వీటి కారణంగా వడ్ల బరువు తగ్గి ఒక్కో లారీ లోడ్‌కి 2 లేదా ఆ పైగా బస్తాలు తగ్గుతున్నాయి. రైతులకు ఇబ్బందుల్లేకుండా రైస్‌మిల్లు యాజమాన్యాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం.

- చంద్రారెడ్డి, మాచారెడ్డి సొసైటీ సీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని