logo

వైద్యురాలి నిర్వాకం.. గాల్లో కలిసిపోయిన బాలింత ప్రాణం!

వైద్యురాలి నిర్వాకంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది..

Published : 10 May 2024 12:59 IST

ఆర్మూర్‌ పట్టణం: వైద్యురాలి నిర్వాకంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో చోటు చేసుకుంది.

మృతురాలి భర్త సాయిలు కథనం ప్రకారం.. ఆర్మూర్‌ పట్టణంలోని శ్రీతిరుమల ఆస్పత్రికి పిట్ల సుమలత (25) అనే మహిళను కాన్పు కోసం కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. గతంలో రెండు కాన్పులు నార్మల్‌ డెలివరీలో అయ్యాయి. మూడో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చారు. సుమలతను అక్కడి వైద్యురాలు శ్రీదేవి వడ్లమూడి పరీక్షించారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని.. నార్మల్‌ డెలివరీ కాకుండా సిజేరియన్‌ చేయాలని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు సరేనన్నారు. సర్జరీ అనంతరం మగబిడ్డకు సుమలత జన్మనిచ్చింది.

అనంతరం పొట్టలో మంటగా ఉందని ఆమె చెప్పడంతో అనస్తీషియా డాక్టర్‌ను కాదని.. శ్రీదేవి మత్తుమందు ఇచ్చారు. దీంతో సుమలత హార్ట్‌బీట్‌ పెరిగి గుండెపోటుతో చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయి 24 గంటలు దాటినా ఆస్పత్రి వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ శుక్రవారం వారంతా ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని