logo

కళావిహీనం.. ఉద్యాన కేంద్రం

ఒకప్పుడు పచ్చని మొక్కలతో కళకళలాడిన ఉద్యానకేంద్రం నేడు కళావిహీనంగా మారింది. ఎందరో గిరిజన రైతులకు శిక్షణలు ఇచ్చిన కేంద్రం నేడు వెలవెల బోతోంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు

Updated : 08 Aug 2022 07:03 IST

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే


తుప్పలతో పేరుకుపోయిన ఉద్యానకేంద్రం

ఒకప్పుడు పచ్చని మొక్కలతో కళకళలాడిన ఉద్యానకేంద్రం నేడు కళావిహీనంగా మారింది. ఎందరో గిరిజన రైతులకు శిక్షణలు ఇచ్చిన కేంద్రం నేడు వెలవెల బోతోంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పలువురు అధికారులు చెప్పినా ముందడుగు పడకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీంతో మొక్కల పెంపకానికి, ఆదాయానికి దూరమైన దీనిపై ఐటీడీఏ  అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది.

గిరిజనులకు ఉపాధి..
గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడు ఉద్యాన కేంద్రం 48 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 280 కొబ్బరి చెట్లు, ఎకరా విస్తీర్ణంలో జీడి, 3.50 ఎకరాల్లో మామిడి, 75 సెంట్లు సపోటా తోటలు ఉన్నాయి. 1990- 2000 మధ్య కాలంలో ఇక్కడ మొక్కలకు అంట్లు కట్టి, రైతులకు శిక్షణ ఇవ్వడంతో ఐటీడీఏకు ఆదాయం వచ్చేది. దీంతో పాటు గిరిజనులకు ఉపాధి లభించేది. అనంతరం నిర్వహణ సరిగా లేకపోవడం, ఇక్కడకు వచ్చే అధికారులు పట్టించుకోక పోవడంతో అభివృద్ధికి దూరమైంది.

ఆదాయానికి దూరం..
ఒకప్పుడు ఏడాదిలో సుమారు 24 వేల మామిడి, 10 వేల జామ, జీడి వంటి మొక్కలను అంట్లు కట్టేవారు. ఒక్కో మొక్కను రూ.50కి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. స్థానికంగా వనరులు ఉన్నా అధికారులు దృష్టి సారించకపోవడంతో కడియం, ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేంద్రం ద్వారా ఏటా కనీసం రూ.లక్ష ఆదాయం రాకపోవడం విచారకరం. వేలం పాటలో ఏటా రూ.50 నుంచి రూ.70 వేలు వరకు మాత్రమే పాడుతున్నారు.

ప్రతిపాదనలతో సరి
ఐటీడీఏకి వస్తున్న పీవోలు ఉద్యానకేంద్రాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. గతంలో పనిచేసిన పీవో లక్ష్మీశ పద్మవ్యూహం, యోగా విగ్రహాలు సమకూర్చారు. బదిలీపై వెళ్లిన తరువాత వచ్చిన వారు బోటు షికారు, వాకింగ్‌ ట్రాక్‌లు, వంతెన, రహదారుల నిర్మాణం చేపడతామని ప్రణాళిక తయారు చేశారు. కానీ పనులు మాత్రం జరగలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పనికిరాని మొక్కలు మొలిచి అధ్వానంగా మారింది. వసతిగృహాలు కూడా శిథిలావస్థకు చేరాయి. దీనిపై ఐటీడీఏ పీహెచ్‌వో మణిభూషణ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో అంతర పంటలను వేసి చేపల పెంపకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

అభివృద్ధిపై ఆశ
ఇన్‌ఛార్జి పీవోగా బాధ్యతలు తీసుకున్న ఆనంద్‌ తొలిసారి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో శుక్రవారం పర్యటించారు. దీనిలో భాగంగా ఎస్‌కేపాడు ఉద్యాన కేంద్రాన్ని సందర్శించారు. 48 ఎకరాలను అంచెలంచెలగా అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత 5 ఎకరాల్లో చేపలు పెంపకం, ఉద్యాన పంటలు, వరి, చిరుధాన్యాలు వంటివి పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రెండు నెలల్లోనే పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు  జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని