logo

పంటల రక్షణకు వినూత్న ఏర్పాట్లు

అడవి పందులు, పక్షుల నుంచి పంటల్ని కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్న ఏర్పాట్లు చేశారు.

Published : 27 Nov 2022 02:41 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: అడవి పందులు, పక్షుల నుంచి పంటల్ని కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్న ఏర్పాట్లు చేశారు. గంజాం జిల్లా పాత్రపురం సమితిలో తుంబాగుడ పంచాయతీలోని జక్కర గ్రామానికి చెందిన రైతు లకు సబర సుమారు అయిదు ఎకరాల్లో గట్లపై వెదుర్లు పాతి, దానిపై ఖాళీ గాజు సీసాల్ని వేలాడదీశాడు. ఓ తాడుకు రెండు ఇనుప చువ్వ ముక్కలు కట్టి, అవి సీసాకు దగ్గరగా ఉండేలా చేసి వాటి అడుగున తాడుతో అట్టముక్క వేలాడదీశాడు. గాలి అట్టముక్కను తాకినపుడు అది ఊగుతుంటే దానికి అమర్చిన ఇనుప ఊచ ముక్కలు సీసాలకు తగిలి శబ్దం వస్తోంది. ఆ శబ్దానికి అడవి పందులు, పక్షులు పంట సమీపంలోకి రావడంలేదు. దీనిని చూసిన మరికొందరు రైతులు ఈ విధానాన్ని అమలు చేశారని పాత్రపురం సమితిలోని బొరంగొ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జె.గణేష్‌ శనివారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తుంబాగుడ పంచాయతీకి వెళ్లిన సమయంలో లకు సబర పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం తన దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని