logo

ముక్కోణ పోరులో విజేత ఎవరు?

పద్మపూర్‌ స్థానాన్ని గెలుచుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. గతంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్‌ మాధ్యమంలో నిర్వహించిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పద్మపూర్‌కు స్వయంగా వచ్చారు.

Updated : 04 Dec 2022 06:21 IST

రేపు తీర్పు చెప్పనున్న ఓటర్లు
పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న ఎస్‌ఈసీ
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే  

ద్మపూర్‌ స్థానాన్ని గెలుచుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. గతంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్‌ మాధ్యమంలో నిర్వహించిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పద్మపూర్‌కు స్వయంగా వచ్చారు. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 15 మంది మంత్రులు, అయిదుగురు ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉండి ప్రచారం చేశారు. భాజపా తరఫున కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్‌ నరేంద్రసింగ్‌ తోమార్‌, అశ్వినీ వైష్ణవ్‌, బిశ్వేశ్వర టుడు, 8 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీ అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ గెలుపు కోసం ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ విషయానికొస్తే... పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి చెల్లా కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌, కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉలక, ఇతర నాయకులు పార్టీ అభ్యర్థి సత్యభూషణ్‌ సాహు తరఫున ప్రచారం చేశారు.

ఓటర్లు ఎవరి పక్షాన?.. పద్మపూర్‌లో అన్నదాతలు, కులత, మోహర్‌, బింజార్‌ కులాల ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. వీరి ఓట్లు రాబట్టుకునేందుకు బిజద, భాజపాలు తీవ్రంగా కృషి చేయగా ఈ రేసులో కాంగ్రెస్‌ రాస్తా వెనుకబడింది. శుక్రవారం ఎన్నికల ప్రచారం చేసిన సీఎం సభా వేదికలపై ఆయా కులాల పెద్దలతో మంతనాలు జరిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి కూడా వారితో వేర్వేరుగా చర్చించి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ శనివారం పద్మపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... బిజద, భాజపా నేతలు కుల పెద్దలను ఆకట్టుకొని ఓట్లు చేజిక్కించుకోవడానికి సొమ్ము పంచారని ఆరోపించారు. ఆర్థిక స్థోమత లేని కాంగ్రెస్‌ ఓటర్లకు పరిస్థితి వివరించి ఓటు అభ్యర్థించిందని చెప్పారు. 


చెప్పింది చేస్తాం... బర్షాను గెలిపించండి
పద్మపూర్‌లో మంత్రుల ప్రచారం

బర్షాను గెలిపించాలని మహిళా ఓటర్ల  చేతులు పట్టుకొని అభ్యర్థిస్తున్న టుకుని సాహు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఆడిన మాట తప్పబోమని, చెప్పింది చేస్తామని, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారని పద్మపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులు చెప్పారు. శనివారం ప్రచారానికి చివరి రోజు కావడంతో నవీన్‌ మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పద్మపూర్‌, ఝార్బంధ్‌, పైకమాల్‌ సమితుల్లో సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పాదయాత్రలు చేపట్టారు. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. మంత్రులు టుకుని సాహు, రీతాసాహు, సరోజిని హేంబ్రంలు ఇంటింటికి వెళ్లి మహిళల చేతులు పట్టుకుని బర్షాను ఆశీర్వదించాలని కోరారు.


చివరిరోజు కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పద్మపూర్‌ ఉప ఎన్నిక ప్రచారం చివరిరోజు (శనివారం) కాంగ్రెస్‌ భారీ ర్యాలీ చేపట్టింది ఝార్బంధ్‌, పైకమాల్‌, పద్మపూర్‌ సమితుల్లో ద్విచక్ర వాహనాలు, కార్ల ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించిన ఆ పార్టీ నేతలు సత్యభూషణ్‌ సాహును  గెలిపించాలని ఓటర్లను కోరారు. బిజద, భాజపాలు పశ్చిమ ఒడిశా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని, పద్మపూర్‌కు జిల్లా హోదా ఇవ్వలేదని, రైతుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ... పద్మపూర్‌లో సత్యభూషణ్‌ విజయం తథ్యమని చెప్పారు. ధర్మపోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు ఓటర్లు ఆదరిస్తారన్నారు.


అన్ని వర్గాల మద్దతు ఉంది
-ప్రదీప్‌ పురోహిత్‌, భాజపా అభ్యర్థి

అన్ని వర్గాల మద్దతు ఉంది. కృషక్‌ సంఘాలన్నీ సహకరిస్తున్నాయి. అసెంబ్లీలో ఈ ప్రాంత ప్రజల గళం వినపడాలని ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల వారంతా నాకే ఓట్లేస్తారు.


ప్రజలు ఆదరిస్తారు
-సత్యభూషణ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి

బిజద, భాజపా నేతల బూటకం హామీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పద్మపూర్‌ నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేను ప్రజోపయోగ పనులు ఎన్నో చేశాను. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్నాను.


ఓటర్ల ఆశీస్సులు ఉన్నాయి..
-బర్షారాణిసింగ్‌ బరిహ, బిజద అభ్యర్థి

ఓటర్ల ఆశీస్సులు నాకున్నాయి. ముఖ్యమంత్రిపై ఉన్న ఆదరణ కలిసొస్తుంది. నాన్న (దివంగత ఎమ్మెల్యే బిజయ రంజన్‌సింగ్‌ బరిహ) ఆశయాలు నెరవేర్చడానికే నేను పోటీలో ఉన్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని