logo

సురేష్‌ మహాపాత్ర్‌ను కొనసాగిస్తారా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పోస్టులో సురేష్‌ మహాపాత్ర్‌ ఉద్యోగ కాలం పొడిగిస్తారా? మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ఈ సర్వోన్నత స్థానంలో నియమిస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.

Published : 28 Jan 2023 02:04 IST

సీఎస్‌ రేసులో పలువురు ఐఏఎస్‌లు
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పోస్టులో సురేష్‌ మహాపాత్ర్‌ ఉద్యోగ కాలం పొడిగిస్తారా? మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ఈ సర్వోన్నత స్థానంలో నియమిస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ పోస్టు కోసం పలువురు ఐఏఎస్‌ సీనియర్‌ అధికారులు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రెండుసార్లు పొడిగింపు

సీఎస్‌గా సురేష్‌ ఉద్యోగ కాలం గతేడాది (2022) ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది. ఈ పోస్టు కోసం అప్పట్లో ఎంతోమంది సీనియర్‌ ఐఏఎస్‌లు ఆశలు పెంచుకున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేసిన సురేష్‌ ఉద్యోగ కాలాన్ని నవీన్‌ మరో 6 నెలలు పొడిగించారు. తర్వాత రెండోసారి మరో 6 నెలలు పెంచారు. ఈ వ్యవధి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ సురేష్‌ సేవలను కొనసాగిస్తారా? అన్నది నవీన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది. విధేయునిగా ఉన్నారన్న ఉద్దేశంతో ఇలా సర్వీసు కాలం పెంచుతూ ఒక్కరినే కొనసాగించడం తగదని మాజీ సీఎస్‌ సహదేవ్‌ సాహు అన్నారు. గురువారం రాత్రి భువనేశ్వర్‌లో సాహు విలేకరులతో మాట్లాడుతూ... సీఎస్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఐఏఎస్‌ సీనియర్‌ అధికారులు ఎందరో ఉండగా సర్వీసు పూర్తి చేసుకున్న వ్యక్తిని కొనసాగించడం సబబు కాదని, దీని వల్ల అధికారుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.


ఆశలు పెంచుకున్న సీనియర్లు.. సురేష్‌ మహాపాత్ర్‌ను ఒడిశా విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ (ఓఈఆర్‌సీ) అధ్యక్షునిగా నియమించే సూచనలు ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఓఈఆర్‌సీ ఛైర్మన్‌ పదవి కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ పోస్టు కోసం ఐఏఎస్‌ సీనియర్‌ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో సహాయ సీఎస్‌ హోదాలో ఉన్న అభివృద్ధి కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ జెనా మొదటి వరుసలో ఉన్నారు. సీనియర్లలో ప్రదీప్త కుమార్‌ మహాపాత్ర్‌, రాజేష్‌ వర్మ, తృహిణికాంత పాండే, సి.జె.వేణుగోపాల్‌, నికుంజ బిహారీ దొళొ పోటీ పడుతున్నారు. వీరంతా నవీన్‌కు విధేయులుగా ఉన్నవారే.


త్వరలో నిర్ణయం.. దీనిపై ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. బిజద ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్‌ మిశ్ర శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... దూరదృష్టి గల నవీన్‌ రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని