logo

కేంద్రం వివక్షను ఎండగట్టండి

పార్లమెంటు ఉభయ సభలు వచ్చే నెల కొలువుదీరనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరం ఆర్థిక, రైల్వే బడ్జెట్‌లు ప్రవేశ పెట్టనున్నారు.

Published : 29 Jan 2023 01:40 IST

బిజద ఎంపీలకు నవీన్‌ ఉద్బోధ

బిజద ఎంపీలతో సీఎం నవీన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఉభయ సభలు వచ్చే నెల కొలువుదీరనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరం ఆర్థిక, రైల్వే బడ్జెట్‌లు ప్రవేశ పెట్టనున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న కీలక బిల్లులన్నింటికీ మద్దతిస్తూ వచ్చిన బిజద ఈసారి స్వరానికి పదును పెట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన శనివారం బిజద పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఎంపీలంతా కలసికట్టుగా ఉభయసభల్లో ఉద్యమించాలని, రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలని సీఎం ఉద్బోధించారు. పార్లమెంటులో లేవనెత్తనున్న అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.


రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయం

లోక్‌సభ బిజద నేత పినాకి మిశ్ర మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సభలో గళం వినిపిస్తామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని ఎంతోకాలంగా నవీన్‌ కోరుతున్నారని, దీనిపై కేంద్రానికి అన్ని, రాష్ట్రాల సీఎంలకు గతంలో ఆయన లేఖలు రాసిన సంగతి గుర్తు చేశారు. మహిళ బిల్లుపై కేంద్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ విషయమై సానుకూలంగా ఉన్న ఇతర పార్టీలతో కలిసి ‘ప్రెషర్‌ గ్రూపు’ ఏర్పాటు చేసి ఆమోదం పొందేలా ఉద్యమిస్తామన్నారు. విధాన పరిషత్‌ ఏర్పాటు బిల్లునూ పట్టించుకోవడం లేదని, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతులను కేంద్రానికి పంపించి నాలుగేళ్లు కావస్తోందన్నారు. ఈసారి సమావేశాల్లో దీనిని ఆమోదించాలని డిమాండ్‌ చేస్తామన్నారు. అసమానతలు, వెనుకబాటు, పేదరికంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న వినతిని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని, దీన్ని మరోసారి ప్రముఖంగా ప్రస్తావిస్తామన్నారు.


అన్ని రంగాల్లో వివక్ష

రాజ్యసభ బిజద నేత సస్మిత్‌ పాత్ర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం పట్ల కేంద్రం అన్ని రంగాల్లో వివక్ష చూపుతోందన్నారు. కేటాయింపులు తగ్గించిన దిల్లీ పెద్దలు పీఎం ఆవాస్‌ యోజనలో 4 లక్షల ఇళ్లు తగ్గించారన్నారు. రైల్వేలు, రహదారుల విస్తరణ, డిజిటల్‌, కమ్యూనికేషన్‌ రంగాలకు ప్రాధాన్యం కరవైందన్నారు. 169 తెగల గిరిజనులను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న వినతులనూ పక్కన పెట్టారన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన నిలిపివేసి రూ.8 వేల కోట్లు ఆదా చేయాలన్న కేంద్రం నిర్ణయం హేయమైనదని, దీన్ని సభలో ఎండగడతామన్నారు. భారత రాజ్యాంగంలో ‘అహింస’ అనే పథం చేర్చాలని నవీన్‌ కేంద్రాన్ని పలుసార్లు కోరినా పట్టించుకోలేదని, ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతామన్నారు. ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయడం లేదని, అన్నదాతలు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని