logo

పది జిల్లాలకు వర్చువల్‌ హైకోర్టు సౌకర్యం

రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్‌ హైకోర్టులను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనుంజయ వై.చంద్రచూడ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

Published : 04 Feb 2023 03:08 IST

ప్రారంభోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ తదితరులు

కటక్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్‌ హైకోర్టులను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనుంజయ వై.చంద్రచూడ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. సాయంత్రం కటక్‌లోని జ్యుడీషియల్‌ అకాడమీ ప్రాంగణంలో హైకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో ఆయన కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ మాట్లాడుతూ వర్చువల్‌ హైకోర్టుల ఏర్పాటు వల్ల రాష్ట్ర ప్రజలకు మరిన్ని న్యాయసేవలు అందుతాయన్నారు. వివిధ జిల్లాలకు చెందినవారు పిటీషన్లను వారి జిల్లాల్లో ఉన్న వర్చువల్‌ హైకోర్టులో దాఖలు చేయవచ్చన్నారు. కేసుల విచారణ కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరుగుతుందని వివరించారు. పిటీషన్‌దారులు ఇక కటక్‌ హైకోర్టుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజల వద్దకు న్యాయ సేవలు అందించేందుకు వీటిని ప్రారంభించిందని వివరించారు. తొలివిడతలో బాలేశ్వర్‌, భద్రక్‌, బొలంగీర్‌, గంజాం, కలహండి, ఖుర్దా, కొరాపుట్‌, పూరీ, సంబల్‌పూర్‌, సుందర్‌గఢ్‌ జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మిగిలిన 20 జిల్లాల్లో కూడా ఈ న్యాయస్థానాలను ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల హైకోర్టును ఆశ్రయించడానికి సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతోపాటు మాజీ న్యాయమూర్తులు   హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని