logo

మన్మోహన్‌ చేతికి రాష్ట్ర కమలం పగ్గాలు

భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షునిగా మన్మోహన్‌ సామల్‌ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా గురువారం సామల్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.

Published : 24 Mar 2023 01:53 IST

త్వరలో నూతన కార్యవర్గం?
ఇక బిజదతో పోరేనా?

భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షునిగా మన్మోహన్‌ సామల్‌ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా గురువారం సామల్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కమలం పగ్గాలు చేపట్టిన ఆయన భాజపాలో అతివాదిగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. త్వరలో సామల్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికల ముందుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అవకాశం ఉంది.

వరుసగా మూడోసారి.. రాష్ట్ర భాజపాశాఖ అధ్యక్షునిగా 1999-20, 2001-04లో (రెండుసార్లు) విధులు నిర్వహించిన మన్మోహన్‌కు విశేషానుభవం ఉంది. బిజద, భాజపా కూటమి ప్రభుత్వంలో ఆయన రెవెన్యూ, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రిగా చేశారు. ఉత్తరకోస్తా (భద్రక్‌ జిల్లా)కు  చెందిన సామల్‌కు కేంద్ర నాయకత్వం మూడోసారి అధ్యక్ష పదవి కేటాయించడం వెనక ఎత్తుగడ ఉంది. రాజకీయ అతివాది అయిన ఆయన నవీన్‌ పట్నాయక్‌ పాలనా వైఫల్యాలు ఎండగట్టడానికి, ఉద్యమాలకు ఊపిరిలూదడానికి కీలకమవుతారు. 2024 ఎన్నికల్లో తూర్పు భారతంలోని ఒడిశాలో కమల వికాసం తథ్యమని భాజపా నేతలంటున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఇటీవల జయనారాయణ మిశ్రను విపక్షనేతగా నియమించారు. అతివాది అయిన మిశ్ర శాసనసభలో పాలక పక్షానికి దీటుగా సమాధానాలు ఇస్తున్నారు. నవీన్‌ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతున్నారు.

సర్దుబాటును చెరిపేస్తారా?.. బిజద, భాజపాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా, ఈ రెండు పార్టీలు మధ్య లోపాయికారీ బంధం ఉందన్న భావన ప్రజల్లో ఉంది. ముఖ్యమంత్రి నవీన్‌కు, ప్రధానికి, ఇతర కేంద్ర నాయకులతో సత్సంబంధాలున్నాయి. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిస్తున్నారన్న వాస్తవాన్ని తుడిచేయడానికే కేంద్ర నాయకత్వం ఏరికోరి అతివాదులకు కీలక బాధ్యతలు కేటాయించినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనిపై విపక్షనేత జయనారాయణ గురువారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇక బిజదతో పోరు రసవత్తరంగా ఉంటుందని, మన్మోహన్‌ నియామకంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా విజయం తథ్యమని జోస్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని