logo

కలహండి... ఎవరిదో విజయమండీ ?

పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్‌సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్‌ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి.

Published : 30 Apr 2024 07:01 IST

కొత్త అభ్యర్థుల మధ్య ముక్కోణపోటీ
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

ఇంద్రావతి ప్రాజెక్టు

 పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్‌సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్‌ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి.

పీవీ అండదండలతో ముందంజ

కలహండి ఒకప్పుడు కరవు కాటకాల జిల్లాగా గుర్తింపు పొంది. ఆకలిచావులు జిల్లాగా జాతీయ ప్రసార సాధనాల్లో చర్చనీయాంశమైంది. కన్నబిడ్డల్ని అమ్ముకుంటున్నారన్న కథనాలు ప్రసారమైన తర్వాత నాటి (దివంగత) ప్రధాని పి.వి.నరసింహారావు స్వయంగా దృష్టి సారించారు. కలహండి, బొలంగీర్‌, కొరాపుట్‌ (కేబీకే) ఉమ్మడి జిల్లా సమగ్ర వికాసమే ధ్యేయంగా నాటి ప్రణాళికా సంఘం నివేదిక సిద్ధం చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్థిక సంఘం ఈ జిల్లాల ప్రగతికి కేబీకే పథకం అమలుకు సిఫార్సు చేసింది. కేంద్రం నిధులు మంజూరు చేసింది. ‘ఓటికుండ’గా అంతా చెప్పుకున్న కలహండిలో ఇంద్రావతి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంతో పచ్చదనం వెల్లివిరిసింది. పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయి. కరవుకాటకాలు దూరమయ్యాయి. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పాటైంది. కేబీకే కార్యక్రమం నిలిపివేసిన కేంద్ర పాలకులు ‘ఆకాంక్ష’ పేరిట వెనుకబడిన జిల్లాల ప్రగతికి దేశవ్యాప్త కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కేబీకే జిల్లాలకు చోటు కల్పించారు.

మొగ్గతొడిగిన చైతన్యం

ఎస్సీ, ఎస్టీలు, యాదవులు (ఓబీసీ) ఎక్కువగా ఉన్న కలహండి ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఇటీవల కాలంలో ప్రారంభమైంది. అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారన్న అపవాదు మూటకట్టుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ అగ్రనేత భక్తచరణ్‌ దాస్‌ కేంద్రమంత్రిగా విధులు నిర్వహించినా జన్మభూమి వికాసానికి చిత్తశుద్ధి కనబరచలేదన్న అసంతృప్తి ఉంది. తర్వాత రాజవంశానికి చెందిన పుష్పేంద్ర సింగ్‌దేవ్‌ బిజదలో చేరి కలహండి ఎంపీగా, తర్వాత నవీన కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆయన హయాంలో కలహండి వాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆకాంక్ష నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి.

రాజవంశీకులకు ఆదరణ

రాజవంశీకులకు కలహండిలో ఆదరణ ఉంది. ఈ జిల్లా కేంద్రం భవానీపాట్నా రాజప్రసాదానికి చెందిన అర్కకేసరిదేవ్‌, ఆయన భార్య మాళవిక దేవి 2014 ఎన్నికల ముందు బిజదలో చేరారు. కలహండి లోక్‌సభ అభ్యర్థిగా అర్కకేసరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2019లో ఆయనకు టికెట్‌ నిరాకరించిన సీఎం మళ్లీ పుష్పేంద్ర సింగ్‌దేవ్‌ను నిలిపారు. నాటి భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు బసంత పండా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అంతా కొత్తవారే

ఇటీవల అర్కకేసరి దంపతులు కాషాయం కండువాలు ధరించారు. భాజపా నాయకత్వం సిటింగ్‌ ఎంపీ బసంత పండా స్థానంలో రాణి మాళవిక దేవిని అభ్యర్థిగా నిలిపింది. రాజపరివారానికి జనాల్లో ఆదరణ ఉన్నందున ఆమెకు అవకాశమిచ్చింది. నవీన్‌ ఎత్తుగడలో భాగంగా యాదవ తెగకు చెందిన లంబోధర్‌ నియార్‌ను ఇక్కడ పోటీకి అవకాశమిచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఎస్టీ వర్గానికి ద్రౌపదీ మాఝిని బరిలో దించింది. యాదవుల ఓటు బ్యాంకు ధ్యేయంగా లంబోధర్‌, దళిత, గిరిజనుల ఓట్ల కోసం ద్రౌపదీ మాఝి ప్రచారం చేస్తున్నారు. అన్నివర్గాల వారికి చేరువయ్యేందుకు రాణి భర్త అర్కకేసరితో కలిసి గ్రామాల్లో పాదయాత్రలు, రోడ్‌షోలు, జనసభలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఈ ముగ్గురు అభ్యర్థులు తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. విజయలక్ష్మి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని