logo

కుటుంబ కధా చిత్రం

విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు

Published : 05 May 2024 04:08 IST

మయూర్‌భంజ్‌ లోక్‌సభ, బొంగిరిపోషి అసెంబ్లీ బిజద అభ్యర్థులు సుధాం మారండి, రంజిత్‌ మరాండి (దంపతులు)
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు. కుటుంబంలో ఒక్కరికే టికెట్‌ అన్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పిందానికి కట్టుబడలేదు. పార్టీలు ఫిరాయించిన నేతలకు బిజద, భాజపా నాయకత్వాలు ప్రాధాన్యమిచ్చాయి. జాబితా ఖరారులో చివరి నిమిషం వరకు మార్పులు, చేర్పులు   జరిగాయి. కొందరికి టికెట్లు కేటాయించి తర్వాత మార్చేశారు. దీంతో స్పష్టత లోపించింది. అయోమయం నెలకొంది. ఎట్టకేలకు జాబితాలు ఖరారు కాగా 41 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఈసారి  పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

33 మందికి నిరాకరణ

 నవీన్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో 33 మందికి ఈసారి టికెట్లు కేటాయించలేదు. వీరిలో 9 మంది భార్యలు, కుమారులు, రక్త సంబంధీకులకు అవకాశమిచ్చారు. మంత్రి ఉషాదేవి సొంత నియోజకవర్గం చికిటిలో ఆమె కుమారుడు బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రతాప్‌జెనా, రాజకిశోర్‌ దాస్‌, రజనీకాంత్‌ సింగ్‌, సంబిత్‌ రౌత్రాయి, ప్రకాశ్‌ చంద్ర మాఝి, పూర్ణచంద్ర స్వయిన్‌, సదాశివ ప్రదాని, సుభ్రత్‌ తరైలలో కొందరి భార్యలకు, మరికొందరి కొడుకులకు సీఎం అవకాశమిచ్చారు.

 ఆరోపణలున్నవారికి టికెట్లు

క్రిమినల్‌ కేసులు, ఆరోపణలున్న వారికి టికెట్లు కేటాయించబోమన్న బిజద నాయకత్వం చెప్పిందానికి కట్టుబడలేదు. హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నేతలు మళ్లీ అభ్యర్థులయ్యారు. మరికొందరు తమ భార్యలు, కొడుకులకు టికెట్లు ఖరారు చేయించుకున్నారు.

భర్త, భార్య, తల్లి, కొడుకు

రెవెన్యూ, విద్యాశాఖల మంత్రి సుధాం మరాండికి సీఎం మయూర్‌భంజ్‌ లోక్‌సభ అభ్యర్థిగా చేశారు. ఆయన భార్య రంజితా మరాండికి మయూర్‌భంజ్‌ జిల్లాలోని బంగిరిపోషి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించారు. జాజ్‌పూర్‌ ఎమ్మెల్యే, బిజద రాజకీయ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ప్రణవ ప్రకాష్‌ దాస్‌ (బొబి) సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన తల్లి సంధ్యారాణి దాస్‌ జాజ్‌పూర్‌ జిల్లా కొరై అసెంబ్లీ అభ్యర్థి.

భాజపాలో ఒకరు, కాంగ్రెస్‌లో ముగ్గురు

భాజపాలో ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈసారి పోటీ నుంచి తప్పుకొని తమ భార్యలు, కుమారులను నిలబెట్టారు. మునుపెన్నడూ లేనంతగా నేతలు పార్టీలు ఫిరాయించారు. వీరిని బిజద, భాజపా నాయకత్వాలు అక్కున చేర్చుకుని టికెట్లు కేటాయించాయి. ప్రధాన పార్టీలు విలువలకు సమాధి కట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిజద టికెట్ల కేటాయింపులో వి.కార్తికేయ పాండ్యన్‌, బొబి కీలకపాత్ర పోషించారు. వారికి విధేయులుగా ఉన్నవారికి అవకాశమిచ్చారు. అంకితభావం ఉన్నవారిని పక్కన పెట్టారన్న అసంతృప్తి పార్టీలో ఉంది. తమ పార్టీలో విజయావకాశాలున్న నేతలు పలువురు ఉన్నారని చెప్పుకున్న భాజపా ఆయారాంలకు అందలమెక్కించింది. కాంగ్రెస్‌ విషయానికొస్తే.. కొత్త ముఖాలను పెద్ద సంఖ్యలో నిలబెట్టింది. కొంతమంది సీనియర్లకు అవకాశమిచ్చింది. కొత్తగా ఎన్నికల బరిలో దిగిన వారిలో ఎంతో మందికి అనుభవం, ప్రజా సంబంధాలు లేవని ఆ పార్టీ కార్యకర్తలంటున్నారు.

 గెలుపు గుర్రాలకే టికెట్లు

బిజద రాజ్యసభ ఎంపీ సస్మిత్‌ పాత్ర్‌ శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... గెలుపు గుర్రాలకే నాయకత్వం టికెట్లు కేటాయించినట్లు చెప్పారు. నవీన్‌ ఆదరణ, ఆకర్షణ పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులకు విజయసోపానాలు అవుతున్నాయని పేర్కొన్నారు.

మోదీ గ్యారంటీ విజయానికి సోపానం

భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్‌ మహాపాత్ర్‌ శనివారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ పార్టీ అభ్యర్థుల విజయ సోపానమన్నారు. అర్హులకే టికెట్లు కేటాయించారన్నారు.

ఈసారి అధికారం తథ్యం

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ ఆదివారం నువాపడలో విలేకరులతో మాట్లాడుతూ... ఏఐసీసీ నాయకత్వం ఉత్తమ చరిత్రకలవారిని అభ్యర్థులుగా చేసిందని ఓటర్లు, ఆదరిస్తారన్న ఆశాభావం ఉందన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీలు విశ్వసిస్తున్న ప్రజలు ఈసారి హస్తానికి గెలిపిస్తారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని