logo

అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు

సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు.

Published : 28 Mar 2024 04:28 IST

ఏగోటివలస- గాదెలవలస మార్గం ఇలా..

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. తారు రోడ్డును తొలగించి, రాళ్లు, రాయి బుగ్గితో చదును చేసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తిచేయకపోవడంతో దుమ్ము, ధూళితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

శంకుస్థాపన చేసి ఆర్నెళ్లు

మండలంలోని మరిపివలస కూడలి నుంచి పార్వతీపురం మండలం గదబవలసను అనుసంధానం చేసేందుకు కొత్త రహదారిని ప్రతిపాదిస్తూ నిధులు మంజూరు చేశారు. దీనికి ఆరు నెలల కిందట ఎమ్మెల్యే జోగారావు శంకుస్థాపన చేశారు. తర్వాత రాళ్లు, రాతి బుగ్గిని వేసి చదును చేసి వదిలేశారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలతో దుమ్ము రేగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ నిధులు సుమారు రూ.90 లక్షలతో చేపట్టిన ఈ పనిని వారం రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెప్పారు.

మరిపివలస నుంచి పార్వతీపురం మండలానికి నిర్మిస్తున్న రహదారి

అర్థాంతరంగా నిలిపివేత

చినభోగిల నుంచి మక్కువ మండల కేంద్రానికి ఉన్న 17 కి.మీ. రహదారిని అభివృద్ధి చేసేందుకు రూ.30 కోట్లు మంజూరు చేశారు. కొన్ని చోట్ల భూసేకరణ చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించారు. అధ్వానంగా ఉన్న చోట్ల రహదారిని తొలగించి రాళ్లతో చదును చేశారు. మరో పక్క గ్రామాల్లో పక్కా కాలువల నిర్మాణం పూర్తి చేశారు. విద్యుత్తు స్తంభాల సైతం తొలగించారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపుల జాప్యంతో పనులు ఆపేశారని ఆర్‌అండ్‌బీ ఏఈ రామ్మోహన్‌రావు తెలిపారు.

చదును చేసి వదిలేసి..

సీతానగరం మండలంలోని ఏగోటివలస నుంచి దయానిధిపురం మీదుగా గాదెలవలసకు 5 కి.మీ. రహదారిని అభివృద్ధి చేసేందుకు గతేడాది జులైలో రూ.1.25 కోట్లతో పనులు ప్రారంభించారు. రాళ్లు పరిచి, రాతి బుగ్గి వేసి చదును చేసి వదిలేశారు. ఈ మార్గం పనులు పూర్తి అయితే బలిజిపేట మండలం నుంచి నియోజకవర్గ కేంద్రానికి చేరుకునేందుకు దగ్గర మార్గం. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనిని నిలిపివేశారని, పూర్తిచేయాలని చెప్పామని పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రమౌళి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని