logo

40 ఏళ్ల నాటి ప్లాట్లు మాయం

విజయనగరం జిల్లా కేంద్రంలో  అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 05 May 2024 05:17 IST

 ఎమ్మెల్యే అనుచరుల దందాతో బాధితులకు అష్టకష్టాలు

 అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగని వైనం

డబుల్‌ కాలనీలోని లేఅవుట్‌ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కేంద్రంలో  అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ పరిధిలోని డబుల్‌ కాలనీ దారిలో దాదాపు 40 ఏళ్ల క్రితం వేసిన ప్లాట్లను మాయం చేసినట్లు సంబంధిత బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు వైకాపా నేత కాళ్ల గౌరీ శంకర్‌తో కలిసి శనివారం నిరసన తెలిపారు. వారి వివరాల ప్రకారం.. బాబామెట్టలోని డబుల్‌ కాలనీ సమీపంలో 1983లో సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ దాదాపు 18 ఎకరాల స్థలంలో లేఅవుట్‌ వేసి ప్లాట్లుగా విభజించింది. అప్పట్లో కొందరు 200 చదరపు గజాలు, 300 చ.గ. చొప్పున స్థలాలను కొనుగోలు చేశారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు వారి సర్వే రాళ్లు కనిపించేవి. కొన్ని నెలలుగా అక్కడ కొందరు వ్యక్తులు చదును చేశారు. రాళ్లన్నీ తీసేశారు. ఈ మేరకు కొనుగోలుదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందించలేదు. దీంతో కాళ్ల గౌరీ శంకర్‌ను ఆశ్రయించారు. తెదేపా నాయకుడు వజ్రపు శ్రీను, బాధితులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అనుచరులు, ఆయన బినామీలు ప్లాట్లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు కనీసం మాట్లాడడం లేదన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న గెడ్డను సైతం కప్పేశారని, ఎవరికీ అనుమానం రాకుండా పైపులైన్లు ఏర్పాటు చేశారన్నారు.

అధికారులు స్పందించలేదు..

1983లో ప్లాట్‌ నెం.38, 39 కింద స్థలాలు కొన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని, మా పిల్లలకు ఉపయోగపడతాయని ఇంతకాలం ఉంచాం. హద్దు రాళ్లు సైతం పాతాం. ప్రస్తుతం ఏవీ లేవు. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాం. ఎవరూ సరిగా స్పందించలేదు. ఇటీవల మళ్లీ చదును చేశారు. ఇక్కడి వాళ్లను అడిగితే అధికార పార్టీ నాయకులు తీసుకున్నారని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- ఎం.సావిత్రి, బాధితురాలు


 ఎమ్మెల్యే చేతుల్లో ఉందంట..

మా అమ్మ 1983లో ఇక్కడి స్థలాన్ని కొన్నారు. ఆమె వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఆమె నడవలేని పరిస్థితి. మా స్థలాన్ని చదును చేసేయడంతో కొన్ని రోజులుగా నేనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా. డబుల్‌ కాలనీ సమీపంలో ఉన్న వారిని కలవగా.. ఎమ్మెల్యే పేరు చెప్పారు. దీంతో ఆయన అనుచరులను కలిశాను. అంతా స్వామి గారి చేతుల్లో ఉందని చెప్పారు.
- వి.శంకరరావు, బాధితుడు


మా స్థలం ఎక్కడుందో తెలియదు..

1983లో మా అత్తయ్య భాగ్యలక్ష్మి పేరున మా మావయ్య ఇక్కడి స్థలం కొనుగోలు చేశారు. గత మూడేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను. గతేడాది ఈ ప్రాంతాన్ని చదును చేశారు. ఎవరిని అడగాలో మాకు తెలియలేదు. ప్రస్తుతం మా స్థలం ఎక్కడుందో కూడా గుర్తించలేకపోతున్నాం. సొసైటీ సభ్యులు సైతం స్పందించడం లేదు.  

- గ్రంధి శంభూ, బాధితుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని