logo

జగనన్న కాలనీల్లో బినామీలు!

ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి.

Published : 07 May 2024 04:29 IST

జోరుగా స్థలాలు, ఇళ్లు విక్రయాలు

అధికార పార్టీ నేతల అక్రమాలు

చోద్యం చూస్తున్న అధికారులు

ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి. అలా అడ్డదారిలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. పేదల నిస్సహాయత, లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులను  ఆసరా తీసుకొని నాయకులే దళారులు అవతారమెత్తడంతో స్థలాలు, పునాదులు వేసి ఇళ్ల బేరసారాలు సాగుతున్నాయి. ఆపై కాలనీల్లో ఖాళీ జాగాల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇలా పేదల కోసం ఉద్దేశించిన జగనన్న కాలనీల్లో నిబంధనలను మీరుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.  

న్యూస్‌టుడే-శృంగవరపుకోట, భోగాపురం, పాలకొండ గ్రామీణం, పార్వతీపురం పురపాలిక : ఉమ్మడి జిల్లాలో జగనన్న లేఅవుట్లు, సొంత స్థలాల్లో మొత్తం 1,04,905 పక్కాగృహాలు మంజూరు చేశారు. నిరుపేద లబ్ధిదారులు ఆర్థిక స్థోమత లేక సతమతవుతున్నారు. ఆపై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇళ్లు కట్టుకొనే పరిస్థితి లేక స్థలాలను అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. కొన్ని లేఅవుట్లలో అనర్హులకు పట్టాలు ఇప్పించిన అధికార పార్టీ నాయకులు ఈ విషయంలో ముందున్నారు. మరో వైపు ఇళ్ల నిర్మాణాలకు గుత్తేదార్లుగా అవతారమెత్తి దందా సాగిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాలు, మేజరు పంచాయతీల్లో, జాతీయ రహదారుల పక్కన వేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇళ్లు కట్టుకొనే పరిస్థితి లేని లబ్ధిదారులను గుర్తించి, వారు నిస్సహాయతను అవకాశంగా తీసుకొని వైకాపా నాయకులు రంగంలోకి దిగడంతో చేతులు మారుతున్నాయి.  

శృంగవరపుకోట పట్టణంలో పుణ్యగిరి రోడ్డులో 35 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. ఇందులో 984 మందికి పట్టాలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 270 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ లేఅవుట్లో 300 ఇళ్ల స్థలాల వరకు అమ్మకానికి పెట్టినట్లు చెబుతున్నారు. కాలనీలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు వెళితే బినామీలే కనిపిస్తున్నారు. మొదట్లో 75 గజాల స్థలం రూ.1.50 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షలకు పెరిగింది. కట్టిన ఇల్లు రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు పలుకుతోంది. ఇదే అదునుగా ఇళ్లకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా కలిపేసుకుంటున్నారు.

ఆక్రమణల పర్వం..

పాలకొండ ప్రాంతంలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అమ్ముకుంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరి కళ్లు జగనన్న కాలనీపై పడింది. కొందరు అధికారుల అండ దండలతోనే దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరపంచాయతీ పరిధిలో లుంబూరు పంచాయతీ సమీపంలో గరుగుబిల్లి వద్ద జగనన్న కాలనీ అర్బన్‌ లేఅవుట్‌ వేశారు. ఇక్కడ 33 ఎకరాలకు పైగా ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. ఈ కాలనీలో 1,500 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. భవిష్యత్తు అవసరాలకు విడిచిపెట్టిన ఖాళీ స్థలాన్ని ఇటీవల కొందరు విక్రయానికి పెట్టారు. సెంటు స్థలం చొప్పున దాదాపు 30 బిట్లుగా హద్దులు నిర్ణయించి ఒక్కోటి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. 

60 శాతం చేతులు మారాయి..

భోగాపురం మండలంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సిమ్మపేట జగనన్న కాలనీలో ఇప్పటికే 60 శాతం స్థలాల చేతులు మారిపోయాయి. ఇక్కడ 235 మంది లబ్ధిదారులకు స్థలాలను కేటాయించారు. ఇప్పటికే చాలామందికి సొంతిళ్లు ఉండడంతో ఇళ్లస్థలాల అమ్మకాలు యథేచ్ఛగా జరిగాయి. ఖాళీ స్థలమైతే రూ.4 లక్షల పైమాటే. పునాదులు నిర్మించి పిల్లర్లు వేసిన వాటికి మరో రూ.2 లక్షలు అదనం. గృహ నిర్మాణం పూర్తయితే రూ.15 లక్షల
వరకు పలికింది. లబ్ధిదారులు ఇళ్లస్థలాలు విక్రయించడం వెనుక స్థానిక వైకాపా నాయకుల చక్రం తిప్పారు. కాలనీలో స్థలం, ఇల్లు అమ్మాలంటే మధ్యవర్తులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష చెల్లించాల్సిందే. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల కాలనీలోనూ ఇదే పరిస్థితి. పక్కపక్కన ఉన్న రెండు స్థలాలకైతేే రూ.10 లక్షల పైమాటే.

ఇళ్ల స్థలాలపైకి ఇతరులు..

పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని జగనన్న కాలనీల్లో స్థలాలను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడతున్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినా.. ఇళ్లస్థలాలను చూపలేదు. ఇతరులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. పట్టాలు లేకున్నా.. ఇళ్లస్థలాలు ఆక్రమిస్తూ అనధికార నిర్మాణాలు చేపడుతున్నారు. పార్వతీపురం ప్రాంతంలో పలు చోట్ల 26 లేఅవుట్లను అభివృద్ధి చేశారు. మొత్తం 3,422 మంది లబ్ధిదారులను గుర్తించగా.. 2,157మందికి మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించారు. మిగిలిన వారికి పట్టాలిచ్చినా స్థలాలు చూపలేదు. కొత్తవలస-జి లేఅవుట్‌ను 4.66 ఎకరాల్లో వేసి, ఇక్కడ 248 మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఇందులో సామాజిక అవసరాల నిమిత్తం 66 సెంట్ల స్థలాన్ని కేటాయించగా.. దీన్ని పలువురు ఆక్రమించినట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పాతబెలగాం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇతరులు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా అన్ని లేఅవుట్లలో ఆక్రమణలతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.


ఇంటిస్థలం అప్పగించలేదు..  పాతబెలగాం లేఅవుట్‌లో తనకు ఇచ్చిన స్థలంలో వేరేవారు పునాదులు నిర్మించారు. దీని గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోతోంది. ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇంతవరకు నాకు కేటాయించిన స్థలం అప్పగించడం లేదు.            

- బి.సరస్వతీ, పార్వతీపురం


జాబితాలో పేరుంది.. పట్టాలేదు.. ఇంటింటికీ జగనన్న కార్యక్రమంలో భాగంగా తనకు రూ.6 లక్షల విలువైన ఇంటిస్థలం మంజూరైనట్లు ఇచ్చిన కరపత్రంలో చూపించారు. ఆ మేరకు తనకు పట్టా జారీ చేయాలని ఏడాదిగా పురపాలక, గృహ నిర్మాణ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా. ఇంటి పట్టా ఇవ్వడం లేదు. స్థలం చూపడం లేదు.
- పి.కనకారావు, పార్వతీపురం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు