logo

ఊడిపోతున్నాయ్‌... పంకా రెక్కలు

పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్‌.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు.

Published : 07 May 2024 04:47 IST

పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్‌.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా, బలంగా నిలిచిన మండల, గ్రామస్థాయి నాయకులంతా తమ అనుయాయులతో కలిసి కూటమిలో చేరుతున్నారు. గ్రామాలకు గ్రామాలు తెదేపా, జనసేన, భాజపా వెంట నడస్తున్నాయి.  దీంతో కూటమి అభ్యర్థుల్లో జోష్‌ నెలకొంది.

 న్యూస్‌టుడే, గరివిడి


మంత్రి బొత్సకు దెబ్బపై దెబ్బ

పార్టీలో చేరినవారికి కండువా వేస్తున్న కళా వెంకటరావు

మంత్రి బొత్స సత్యనారాయణకు పెట్టని కోటగా  ఉన్న మెరకముడిదాం మండలంలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు చెందిన రాజకీయ వారసులతో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు అధిక సంఖ్యలో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఎం.రావివలస, బుదరాయవలస, జి.మర్రివలస, కొత్తకర్ర, ఊటపల్లి, కొమ్మానివలస, పులిగుమ్మి, గొట్టిపల్లి, చినరవ్వాం తదితర గ్రామాల నుంచి 600 కుటుంబాలతో పాటు, సోమలింగాపురం, ఇప్పలవలస, పెదపూతికవలస గ్రామాల్లో కీలక వైకాపా నేతలు తెదేపా గూటికి వచ్చేశారు. గరివిడి మండలం వెదుళ్లవలసలో 100 కుటుంబాలు, కె.పాలవలస, గెడ్డపువలస గ్రామాల ప్రస్తుత సర్పంచులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. చీపురుపల్లి పట్టణంలో పలువురు వార్డు సభ్యుల ఆధ్వర్యంలోచాలా కుటుంబాలు సైకిలెక్కేశాయి.

 


గజపతినగరంలో కొత్త ఊపు

ఈ నియోజకవర్గంలో యువనేత, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ మక్కువ శ్రీధర్‌ వైకాపాను వీడి తెదేపాలోకి వచ్చారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామం నుంచి 200 కుటుంబాలు చేరాయి. బొండపల్లి మండలం మరువాడ సర్పంచి శ్రీనివాసరావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు గొడ్డు రాము, దత్తిరాజేరు మాజీ జడ్పీటీసీ గొటివాడ పుష్పారావు, మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కుమారుడు కృష్ణమూర్తినాయుడు వైకాపాకు బైబై చెప్పి పసుపు కండువాలు కప్పుకొన్నారు. వరుస చేరికలతో ఇక్కడ తెదేపా బలం పుంజుకోగా కీలక నేతలు దూరం కావడంతో వైకాపా కలవరపడుతోంది.


కోలగట్లకు ముచ్చెమటలు

విజయనగరం నియోజకవర్గంలో బలమైన బీసీ నేతలు ఎన్నికల వేళ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. రాజకీయాల్లో సీనియర్‌ నేతగా ఉన్న పిళ్లా విజయకుమార్‌, వైకాపా యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్‌, 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ ద్వాదశి సుమతి, మాజీ కౌన్సిలర్లు జి.సత్యనారాయణ, జి.అప్పారావు, సర్పంచి కంది జగదీశ్వరి వంటి కీలక నేతలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వైకాపాకు చెందిన కార్పొరేటర్‌ వజ్రపు సత్యగౌరి, శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెదేపాలో చేరాయి. అర్బన్‌ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ కాళ్ల గౌరీశంకర్‌ తెదేపాకు మద్దతు ప్రకటించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే,   కోలగట్ల అవినీతి, అక్రమాల చిట్టాను విప్పుతూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో కోలగట్లకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది.


ఎస్‌ కోటలో ఉక్కబోత

శృంగవరపుకోట నియోజకవర్గంలో వైకాపా కీలక నేతలతో ఏకంగా ఒక వర్గం తెదేపాలో చేరిపోయింది. ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాజు, మండలాధ్యక్షుడు ఎస్‌.సోమేశ్వరరావుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 15 మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం చూపగల కీలక నేతలు ఇక్కడ వైకాపాకు దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ తగిలినట్టయింది.  జామి మండలం కలగడ, రామయ్యపాలెం, కొత్తవలస మండలం తుమ్మకాపల్లి, ఎస్‌.కోట మండలం వీరనారాయణపురం, తలారి, బొడ్డవర గ్రామాల నుంచి వందల సంఖ్యలో వైకాపా శ్రేణులు తెదేపాలోకి వలసలు రావడంతో పసుపు దళం మంచి ఊపు మీద ఉంది. ఒక వైపు చేరికలతో తెదేపా బలం పుంజుకోగా ఆ పార్టీ కీలక నేత గొంప కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేస్తుండడం పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.  


పసుపు వర్ణం.. బొబ్బిలి కోట

బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరిగాయి. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి తెంటు అప్పలనాయుడు, సీర శంకరరావు, శంబంగి గురువుగారి అప్పలనాయుడు, రాయపల్లి సత్యనారాయణలతో పాటు వాలంటీర్లు సైతం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. చింతాడ గ్రామ వార్డు సభ్యులు పలు కుటుంబాలతో పసుపు కండువా వేసుకున్నారు. డి.గదబవలస, పెరుమాళి, చీకటిపేట, అప్పలంపేట, సోంపురం, కొత్తరేగ, కోటశిర్లాం, అలజంగి అలజంగి, ఎం.బూర్జివలస, చింతాడ, కలవరాయి, గొంగాడవలస గ్రామాల నుంచి పెద్దఎత్తున చేరారు. ఇప్పటికే ఇక్కడ బలంగా ఉన్న తెదేపా వలసలతో మరింత దృఢంగా మారి వైకాపాకు గాలి ఆడనివ్వడం లేదు.  


బడ్డుకొండకు చుక్కెదురు

నెల్లిమర్ల నియోజకవర్గంలో వైకాపా నుంచి జనసేనలోకి భారీగానే చేరుతున్నారు. ఇక్కడ నుంచి కూటమి మద్దతుతో జనసేన అభ్యర్థిగా లోకం నాగ మాధవి బరిలోకి దిగిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలతో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుకు చుక్కెదురవుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా తెదేపా నేతలంతా జనసేన అభ్యర్థి వెన్నంటి నిలిచి కలిసికట్టుగా పనిచేస్తుండగా.. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండను వ్యతిరేకించే వారంతా జనసేనలోకి వలస వస్తున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్‌ బంగారు సరోజినితో పాటు భోగాపురం మండలం మాజీ ఎంపీపీ ఇందుమతి వైకాపాను వీడారు. పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం మండలాల నుంచి పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీల ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు పెద్దఎత్తున జనసేనలోకి రావడంతో ఊపు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని