logo

అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?

సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.

Published : 10 May 2024 02:28 IST

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు. తాగునీటి సరఫరాలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న పట్టణ ప్రజలను కష్టాల పాల్జేశారు. కుళాయి పైపుల నుంచి నీరు పూర్తిస్థాయిలో రావడం లేదని వార్డుల వారీగా వాడుక నీరు ఇచ్చేందుకు నీటి పథకాలు ఏర్పాటు చేశారు. 9 ట్యాంకులు మరమ్మతులకు గురై మూలన పడితే వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కుళాయి పైపులు మురుగు కాలువల్లో ఉండటంతో తుప్పు పట్టి నీరు కలుషితం అవుతుంది. రూ.69 కోట్లతో నీటి పథకం మంజూరై అయిదేళ్లయినా శిలాఫలకం వేయడం తప్ప పిడికెడు సిమెంట్‌ పని కూడా చేయలేదు. లక్షల మందికి తాగునీరు అందించే వేగావతిలో మురుగు నేరుగా కలవడంతో కలుషితం అవుతోంది. రోడ్లు, కాలువలు అధ్వానంగా ఉన్నాయి.  


మౌలిక సౌకర్యాల్లేవు..

- బి.సూర్యనారాయణ, రామాకాలనీ, సాలూరు

సాలూరు పట్టణంలో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. ప్రధాన రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి వేగావతి వంతెన వరకు 2 కిలోమీటర్ల మేర ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. జాతీయ రహదారిలో వెళ్లేవారు మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, కాలువల అధ్వానంగా ఉన్నాయి.


అభివృద్ధి ఏదీ..?

- కె.శ్రీనివాసరావు, వ్యాపారి, సాలూరు

వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి అనే మాట మరిచారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రోడ్లు, కాలువలు, తాగునీరు, వీధి దీపాలతో పాటు సామాజిక మరుగుదొడ్లు, మురుగు సమస్యలతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అయిదేళ్లయినా పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు