logo

సంతనూతలపాడుదే తొలి ఫలితం

సార్వత్రిక సమరంలో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్‌ ప్రక్రియ సాగింది. మొత్తం 2,183 పోలింగ్‌ కేంద్రాలుండగా, వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లున్నారు.

Updated : 25 May 2024 06:20 IST

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరం

సార్వత్రిక సమరంలో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్‌ ప్రక్రియ సాగింది. మొత్తం 2,183 పోలింగ్‌ కేంద్రాలుండగా, వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లున్నారు. వీరిలో 15,89,890 మంది బారులు తీరి వినియోగించుకున్న తమ హక్కు ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషిన్స్‌)ల్లో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. పోలైన ఓట్లను జూన్‌ 4న రౌండ్ల వారీగా వేర్వేరు గదుల్లో సమాంతరంగా లెక్కించనున్నారు. అందుకుగాను మరో పది రోజులే సమయం ఉంది. దీంతో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ పర్యవేక్షణలో అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా చేపడుతున్నారు.

 న్యూస్‌టుడే,ఒంగోలు గ్రామీణం

ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను మొత్తం 161 రౌండ్లలో లెక్కించనున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 22 రౌండ్లలో, అత్యల్పంగా యర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు 19; దర్శి, కొండపి, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

ఒక్కో రౌండ్‌కు 25 నిమిషాల మేర సమయం పట్టనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా తుది ఫలితాలు వెలువడేందుకు సాయంత్రం 4 గంటలు కానున్నట్లు అంచనా. గెలిచిన అభ్యర్థికి సదరు నియోజకవర్గ ఆర్వో ఎన్నిక పత్రం అందజేస్తారు.

అన్ని చోట్లా రెండు బ్యాలెట్‌ యూనిట్లు

సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 256 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. దీంతో జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే వెల్లడవుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఒంగోలు 26 మంది, మార్కాపురం 27 మంది, గిద్దలూరు 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించారు. ఒంగోలు పార్లమెంట్‌కు కూడా 25 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రెండు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించారు.

ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లు 

పార్లమెంట్‌..  అసెంబ్లీల వారీగా...

  •  ప్రతి రౌండ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున బల్లలు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు.
  •  ప్రతి బల్ల వద్ద ఒక పర్యవేక్షకుడు, ఒక సహాయ పర్యవేక్షకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు, వారు ప్రతిపాదించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు.
  •  జూన్‌ 4వ తేదీ ఉదయం 5.30కు సిబ్బందికి టేబుల్‌ కేటాయింపు ప్రక్రియ చేపడతారు.

  •  ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు.
  •  ప్రతి రౌండ్‌లో 14 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
  •  తొలుత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారు.
  •  అసెంబ్లీ నియోజకవర్గానికి 14 బల్లల చొప్పున ఎనిమిది నియోజకవర్గాలకు మొత్తం 112; పార్లమెంటుకు మరో 112 ఏర్పాటు చేయనున్నారు.
  •  ఒక్కో బల్లకు ముగ్గురు చొప్పున 672 మంది; పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు మరో 240 మందిని నియమిస్తారు.

  •  ఓట్ల లెక్కింపునకు మొత్తం 912 మంది అవసరం, అదనంగా 20 శాతం మందిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక చేశారు.
  •  పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభించిన అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన వాటి ప్రక్రియ మొదలవుతుంది.
  •  స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన కంట్రోల్‌ యూనిట్లను పోలింగ్‌ కేంద్రాల వారీగా వరుస క్రమంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గ్రామ రెవెన్యూ సహాయకులు, హమాలీల ద్వారా లెక్కింపు కేంద్రంలోకి తెస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని