logo

ఆశలన్నీ రివర్స్‌

గూడు లేని పట్టణ పేదలకు టిడ్కో ద్వారా నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లు ఇప్పట్లో అందేలా లేవు. నాలుగేళ్లుగా ఇవిగో అవిగో అంటూ కాలయాపన చేయడం తప్ప.. నిర్మాణాలు నిర్దిష్టంగా ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. దీంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లల్లో ఉంటూ అవస్థలు పడుతూనే ఉన్నారు.

Published : 12 Aug 2023 06:09 IST

ఏళ్లుగా లబ్ధిదారులకు అందని టిడ్కో ఇళ్లు
తాళాలివ్వకున్నా కిస్తీల చెల్లింపులు
నగదు తిరిగివ్వాలని బాధితుల నిలదీతలు
ఈనాడు, ఒంగోలు

కనిగిరిలో పూర్తిస్థాయి పనులకు నోచని టిడ్కో గృహ సముదాయం

గూడు లేని పట్టణ పేదలకు టిడ్కో ద్వారా నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లు ఇప్పట్లో అందేలా లేవు. నాలుగేళ్లుగా ఇవిగో అవిగో అంటూ కాలయాపన చేయడం తప్ప.. నిర్మాణాలు నిర్దిష్టంగా ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. దీంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లల్లో ఉంటూ అవస్థలు పడుతూనే ఉన్నారు. అదే సమయంలో మరికొందరు నగదు చెల్లించినప్పటికీ అటు ఇళ్లు మంజూరవ్వక.. కట్టినవి తిరిగిరాక ఆందోళన చెందుతున్నారు. కొందరైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఏకంగా ప్రజాప్రతినిధులనే నిలదీస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో కలిపి టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించిన వారు దాదాపు 15 వేల మంది ఉంటే.. ఒక్క ఒంగోలు నగరంలోనే 10,814 మంది ఉన్నారు. వీరికి రూ.21 కోట్లకు పైగా డబ్బులు తిరిగివ్వాల్సి ఉంది. దీనికితోడు 365 చదరపు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారుల్లో కొందరికి బ్యాంకులు రుణాలు మంజూరయ్యాయి. వీటిని నేరుగా టిడ్కోకు అధికారులు జమ చేశారు. అయితే బ్యాంకుల నుంచి నోటీసులు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇంటి తాళాలు అందక ముందే కిస్తీలు కట్టాల్సిన పరిస్థితి దాపురించడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

రద్దే కానీ.. పూర్తిపై దృష్టేదీ...

ఉమ్మడి ప్రకాశంలోని ఒంగోలు 1, ఒంగోలు 2, అద్దంకి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, చీరాల, చీమకుర్తిలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం సంకల్పించింది. వివిధ కారణాలతో చీరాలకు టిడ్కో ఇళ్లు మంజూరు కాలేదు. చీమకుర్తిలో స్థల సేకరణ చేపట్టకపోవడంతో రద్దు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 6112, 365 చదరపు అడుగుల్లో 1824, 430 చదరపు అడుగుల్లో 1632 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 11,968 ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయి. 2019 ఎన్నికల ఫలితాల నాటికి కందుకూరులో 80 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 25 శాతం కంటే తక్కువ పనులే చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను రద్దు చేసింది. దీంతో 2,400 రద్దవ్వగా.. 9,568 నిర్మాణంలో ఉన్నాయి.

గిద్దలూరు గృహ సముదాయంలో అర్ధాంతరంగా నిలిచిన రహదారి

నిర్మాణం మాటలే తప్ప.. చేతలేవీ...

టిడ్కో లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. అందులో 300 చదరపు అడుగుల ఇంటి విలువ రూ.6.65 లక్షలకుగాను, అందులో రాయితీ రూ.1.5 లక్షలు కేంద్రం, రూ.5.15 లక్షలు రాష్ట్రం భరిస్తుందని, లబ్ధిదారుడు రూ.1 చెల్లిస్తే సరిపోతుందని ఊదరగొట్టింది. 365 చ.అ ప్లాట్‌కు రాష్ట్రం వాటా రూ.2.85 లక్షలు, లబ్ధిదారుడి వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణం రూ.3.05 లక్షలు, 430 చ.అ ప్లాట్‌కు రాష్ట్ర వాటా రూ.2.85 లక్షలు, లబ్ధిదారుడి వాటా రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.3.80 లక్షలుగా ప్రకటించింది. వాటా డబ్బులు కట్టినా ఇల్లు రద్దు అయిన వారికి డబ్బులు వెనక్కివ్వడంతో పాటు జగనన్న కాలనీల్లో స్థలం కేటాయించి ఇంటిని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచలేదు. దీంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలంటూ ప్రజాప్రతినిధులను బాధితులు నిలదీస్తున్నారు. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో ఇప్పటికీ మౌలిక వసతులకు టెండర్‌ పిలిచినా పనులు ప్రారంభించి ఆపేశారు.

  • ఈ విషయంపై జిల్లా అధికారి ఒకరు మాట్లాడుతూ.. జిల్లాలో మూడో విడతలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీకి ప్రభుత్వ షెడ్యూల్‌ ఇచ్చిందని, డబ్బులు కట్టినవారికి తిరిగి చెల్లింపులు చేయడానికి నిధులు విడుదల చేయనుందని చెప్పారు. ఒంగోలులో 4,128, గిద్దలూరులో 1248, మార్కాపురంలో 912, కనిగిరిలో 912 టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన త్వరలో పూర్తిచేస్తామన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని