logo

Andhra news: ‘భూముల్లో ఆ ఎమ్మెల్యే వాటా అడుగుతున్నారు’

‘మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి మా కుటుంబ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. పంచాయితీ పేరుతో తమకూ సగం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు.

Updated : 21 Dec 2023 08:57 IST

తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న సుబ్బారెడ్డి, మునిరెడ్డి

మార్కాపురం, న్యూస్‌టుడే: ‘మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి మా కుటుంబ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. పంచాయితీ పేరుతో తమకూ సగం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి..’ అని కోరుతూ మార్కాపురం మండలం బిరుదులనరవ గ్రామానికి చెందిన విశ్రాంత వీఆర్వో మునిరెడ్డి, ఆయన కుమారుడు సుబ్బారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులకు వారసత్వంగా వేర్వేరు సర్వే నంబర్లతో మొత్తం 65 ఎకరాల వరకు భూమి ఉందన్నారు. పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలిపారు. ఈ విషయం అధికార పార్టీ నాయకుల వద్దకు చేరడంతో వారు పంచాయితీ చేసి తమకు సగం వాటా ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడి అండతో మా కుటుంబంలోని ఇతరులు భూమిని ఆక్రమించి దున్ని చదును చేసుకుంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో తాను జిల్లా కలెక్టర్‌, ఉప కలెక్టర్‌లను ఆశ్రయించినట్లు చెప్పారు. వారిచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరికి తనకు అనుకూలంగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అదేమని అడిగితే తమపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని