logo

Ongole: ప్రాణం తీసి ఇంటికి తాళం వేసి.. చిన్నారి ఏడుపుతో వెలుగులోకి

వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఒంగోలు నగరంలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 

Updated : 31 Dec 2023 11:33 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఒంగోలు నగరంలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసుల వివరాల ప్రకారం.. నంధ్యాల జిల్లా గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి(32)కి అదే ప్రాంతానికి వెంకట్‌రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. సమీపంలోని నందిపల్లెకు చెందిన మహేష్‌ అనే యువకుడితో గౌరికి పరిచయమైంది. అతడికి కూడా వివాహమై పిల్లలు ఉన్నారు. మహేష్‌తో తన భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి వెంకట్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. సుమారు నాలుగు నెలలక్రితం గౌరి, మహేష్‌ నంధ్యాల నుంచి ఒంగోలు వచ్చారు. గౌరి తన ఇద్దరు కుమార్తెలను స్వగ్రామంలోనే విడిచిపెట్టి పదేళ్ల చిన్న కుమార్తెతో కలిసి మహేష్‌ వెంట వచ్చింది.

స్థానిక రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. మహేష్‌ బేల్దారి పనులు చేసేవాడు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత సద్దుమణిగింది. శనివారం ఉదయం గౌరి ఉంటున్న ఇంట్లోనుంచి ఆమె కుమార్తె బిగ్గరగా ఏడుస్తుండడంతో స్థానికులు వెళ్లి చూసేసరికి గౌరి మృతి చెంది ఉంది. మహేష్‌ ఆమెను హత్యచేసిన అనంతరం ఇంటికి తాళంవేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై పున్నారావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గౌరి నిద్రించిన మంచం కింద తాడును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ శవాగారానికి తరలించారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని