logo

YSRCP: జగన్‌ కంట్లో ఒంగోలు కారం

మాగుంట శ్రీనివాసులురెడ్డి మాత్రం వద్దు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే ముద్దు.. ఇదీ వైకాపా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా పరిణమించాయి.

Updated : 13 Jan 2024 10:53 IST

గురువారం రాత్రి హైదరాబాద్‌లో ‘గుంటూరు కారం’ సినిమా వీక్షిస్తున్న మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మాగుంట శ్రీనివాసులురెడ్డి మాత్రం వద్దు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే ముద్దు.. ఇదీ వైకాపా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా పరిణమించాయి. తాడేపల్లి ప్యాలెస్‌ వైఖరిపై అలకబూనిన బాలినేని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి గుంటూరు కారం సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తింటూ సేదతీరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అదే సమయంలో వరుసకు అల్లుడైన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి జిల్లాలో చుక్కలు చూపిస్తున్నారు.

నేడు బాలినేని వద్దకు సజ్జల, సాయిరెడ్డి..!

ఎంపీ మాగుంటతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని బాలినేని పట్టుబడుతున్నారు. అధిష్ఠానం అందుకు ససేమిరా అంటోంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయలేని వారు తమకు అవసరమే లేదంటోంది. అదే సమయంలో బాలినేనిని వదులుకునేందుకు మాత్రం ఆ పార్టీ సిద్ధంగా లేదు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ నూతన సమన్వయకర్తల పరిచయ సభల్లోనూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. బాలినేని ఒంగోలు నుంచే పోటీ చేస్తారన్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేయలేనంటే ఎలాగంటూ ఎంపీ మాగుంటను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ప్రస్తుతం అలకపాన్పుపై ఉన్న బాలినేనిని బుజ్జగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి బృందం శనివారం హైదరాబాద్‌ వెళ్లనున్నట్లు తెలిసింది. ఒంగోలులో ఇళ్లస్థలాల సమస్య పరిష్కారానికి నిధులు ఇస్తామనీ, ఎంపీ అభ్యర్థిగా మాగుంటే ఉండాలనే డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనను బాలినేని ముందు ఉంచనున్నట్లు సమాచారం.

రవిశంకర్‌కు సీఎంవో నుంచి పిలుపు..

విజయసాయిరెడ్డి కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తల పరిచయ సభ కోసం ఒంగోలు వచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలులోని తన కార్యాలయంలో కీలక అనుచరులతో మంతనాలు సాగించారు. ఇదే సమయంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రవిప్రియ గ్రూప్‌ అధినేత కంది రవిశంకర్‌కు సీఎంవో నుంచి పిలుపు రావడంతో ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈయన మంత్రి బొత్స సత్యనారాయణకు వియ్యంకుడు. సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు సమీప బంధువు. ఈ పరిణామం ఇప్పుడు ఒంగోలు రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని