logo

ఏం చేద్దాం!.. ‘ఏ జెండా పడదాం!!’

అధికార పార్టీలో తిరుగులేని నేతలుగా చెలామణి అయిన నేతలు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒకప్పుడు తేల్చి చెప్పిన నిర్ణేతలు. తమ కనుసైగతో జిల్లా రాజకీయాలను శాసించిన సీనియర్లు.

Updated : 14 Jan 2024 11:49 IST

అనుచరులతో నేతల మంతనాలు ‌
హైదరాబాద్‌లో మాజీ మంత్రి చర్చలు
మాగుంటతో బలరాం, సుధాకర్‌బాబు భేటీలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే

అధికార పార్టీలో తిరుగులేని నేతలుగా చెలామణి అయిన నేతలు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒకప్పుడు తేల్చి చెప్పిన నిర్ణేతలు. తమ కనుసైగతో జిల్లా రాజకీయాలను శాసించిన సీనియర్లు. అధిష్ఠానం నిర్ణయాలు.. తాడేపల్లి ప్యాలెస్‌ తీరుతో అటువంటి వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. కనీసం వారితో భేటీ కావడానికీ కూడా వైకాపా అధినేత ఇష్టత చూపడం లేదు. తమకు టికెట్లు దక్కుతాయో లేదో అని నిరీక్షించాల్సిన దుస్థితి. ఈ పరిణామాలు వారిని తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. దీంతో ఏం చేద్దాం.. ఎలా చేద్దాం.. ఏ పార్టీలోకి వెళ్దాం.. ఏ జెండా చేతపడదాం అనే ఆలోచనలు చేస్తున్నారు.

వైకాపాలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మాగుంట కుటుంబానికి టికెట్‌ లేదని తేల్చేసిన అధిష్ఠానం.. వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. బాలినేని మా పార్టీలో కీలకనేత అంటూనే ఆయన భవితవ్యాన్ని ఎటూ తేల్చకుండా ఆయనతో పాటు శ్రేణులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. దీంతో కీలక నేతలు తమ అనుచరగణంతో భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్దామనే విషయమై చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల నూతన సమన్వయకర్తల పరిచయ సభలకు కీలక నేతలు ముఖం చాటేశారు. తాజాగా శనివారం మార్కాపురంలో నిర్వహించిన యర్రగొండపాలెం సమావేశానికి మంత్రి సురేష్‌ వర్గీయులు డుమ్మా కొట్టడం గమనార్హం.

పరాభవం.. వ్యూహాత్మక మౌనం...

బాలినేని ఇటీవల మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి తాడేపల్లి ప్యాలెస్‌ పిలుపు కోసం వేసిచూశారు. అక్కడి తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో తీవ్ర అవమాన భారంతో వెనుదిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. ముప్ఫై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి ఘోర పరాభవాన్ని ఎన్నడూ చూడలేదని సన్నిహితుల వద్ద వాపోయారు. ఇక తాడేపల్లి పిలిచినా వచ్చేది లేదని తేల్చి చెప్పారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వస్తున్న నాయకులతో మంతనాలు అక్కడే మంతనాలు సాగిస్తున్నారు. ఇంతటి ఉత్కంఠలోనూ సినిమాలు చూస్తూ, పాప్‌కార్న్‌ తింటూ గడుపుతున్నారు. అదే ఇప్పుడు వైకాపా నేతలు, శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. ఒంగోలు ఎంపీగా మాగుంటను కాదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని అధిష్ఠానం ప్రతిపాదించినా ఆయన ససేమిరా మౌనం వీడలేదు. పరాభవం తర్వాత చూపుతున్న ఈ మౌనం వ్యూహాత్మకం అని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి...

మాగుంట, బాలినేని జోడీని విడదీయాలని వైకాపా అధిష్ఠానం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. అదే సమయంలో బాలినేనిని పార్టీలో నుంచే బరిలోకి దింపాలని, లేకుంటే నష్టం తప్పదని భావిస్తోంది. అయితే మాగుంట జోడీ కాకుండా, ఎంపీ అభ్యర్థిగా తన బావ వై.వి.సుబ్బారెడి కుమారుడు విక్రాంత్‌రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా సమ్మతించేది లేదని మాజీ మంత్రి చెబుతున్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి కాదంటే ప్రత్యామ్నాయాల పైనా వైకాపా దృష్టి సారించింది. అందులో భాగంగానే రవిప్రియ గ్రూప్‌ అధినేత కంది రవిశంకర్‌ను సీఎంవోకు పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడినట్లు ప్రచారం.

ఆ జోడీ కోసం బడా వ్యక్తులు...

మాగుంట, బాలినేని జోడీని ఒంగోలు నుంచి బరిలోకి దింపేందుకు కొందరు బడా వ్యక్తులు రంగంలోకి దిగినట్లు ప్రచారం. మాగుంట కుటుంబం వైకాపాను వీడి తెదేపాలోకి వెళ్తే శ్రీనివాసరెడ్డిని కూడా తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా లాబీయింగ్‌ సాగుతున్నట్లు సమాచారం. కొందరు సినీ పరిశ్రమ పెద్దలతో పాటు మరికొందరు కీలక నాయకులు దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిసింది.

గుంభనంగానే మాగుంట...

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గుంభనంగా రాజకీయం నడుపుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన ఒంగోలులోనే మకాం వేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా మాట్లాడారు. తన మనసులో ఏమున్నదీ బయట పెట్టకుండానే అనుచరుల అంతరంగం ఏంటని ఆరా తీస్తున్నారు. తనకు ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్న బాలినేని నిర్ణయం కోసం ఆయన వేచిచూస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం ఆయనతో బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సమావేశమయ్యారు. ఇద్దరి మధ్యా గంటకు పైగా చర్చలు సాగాయి. అనంతరం వైకాపా టికెట్‌ నిరాకరించి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికకు గురైన సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు కూడా మాగుంటతో విడిగా భేటీ అయ్యారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తాను మీ వెంట నడుస్తానని ఆయన మాగుంటతో చెప్పినట్లు ప్రచారం.

తొలి సమావేశంలోనే సెగ...

జిల్లా కేంద్ర రాజకీయం ఉత్కంఠభరితంగా సాగుతుంటే.. అటు యర్రగొండపాలెం నూతన సమన్వయకర్తగా నియమితులైన తాటిపర్తి చంద్రశేకర్‌కు కూడా వర్గ పోరు సెగ తగిలింది. నియోజకవర్గానికి కొత్త అయిన చంద్రశేఖర్‌ను పరిచయం చేసేందుకు మార్కాపురంలో యర్రగొండపాలెం వైకాపా కార్యకర్తలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదరు నియోజకవర్గ సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు. సరికదా ఆయన అనుచరగణం కూడా ముఖం చాటేసింది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి బాలినేనిని కలిసేందుకు మంత్రి మేరుగు నాగార్జున శనివారం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. సంతనూతలపాడులో పోటీకి ఆశీస్సులు కావాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇలా ఉంటే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఎవరిని నియమిస్తారో తెలియక అటు ఆశావహులు, ఇటు వైకాపా శ్రేణులు తల పట్టుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని