logo

అంగన్‌వాడీ కార్యకర్తలపై నోరు జారి.. ఆపై చెంపలేసుకుని సారీ..

‘మీరు చదివింది పదో తరగతే. అయినా మీకు ప్రభుత్వం రూ.11,500 ఇస్తోంది. అదే చాలా ఎక్కువ. ఇంకా జీతాలు పెంచాలంటూ ధర్నాలు, సమ్మెలు చేయడం ఎందుకు...’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి ఓ వ్యక్తి అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడారు. అందుకు ఆగ్రహించిన కార్యకర్తలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 14 Jan 2024 13:10 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మీరు చదివింది పదో తరగతే. అయినా మీకు ప్రభుత్వం రూ.11,500 ఇస్తోంది. అదే చాలా ఎక్కువ. ఇంకా జీతాలు పెంచాలంటూ ధర్నాలు, సమ్మెలు చేయడం ఎందుకు...’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి ఓ వ్యక్తి అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడారు. అందుకు ఆగ్రహించిన కార్యకర్తలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం చోటుచేసుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి శిబిరం వద్దకు వచ్చారు. అంగన్‌వాడీలనుద్దేశించి మీకెందుకు జీతాలు పెంచాలంటూ దుర్భాషలాడారు. దీంతో కార్యకర్తలు, ఆయాలు అతన్ని చుట్టుముట్టి తమ సమస్యలు మీకేం తెలుసని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా తాము ఆందోళన చేస్తుంటే మీకేం నష్టమంటూ ప్రశ్నించారు. దీంతో అతను వారికి దండం పెట్టి మన్నించాలని కోరుతూ అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అనంతరం అతని చిరునామా గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కార్యకర్తలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి దీక్షలకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

కొనసాగుతున్న నిరసనలు...: అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో 33వ రోజైన శనివారం కొనసాగింది.  ఒంగోలుతో పాటు, మద్దిపాడు, మర్రిపూడి, పొన్నలూరు, కనిగిరి, వెలిగండ్ల, మార్కాపురం, పెద్దదోర్నాల, టంగుటూరు, కొండపి, బేస్తవారపేట, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి ప్రాంతాల్లోనూ దీక్షలు సాగాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జగనన్నకు చెబుదాం అంటూ సంతకాల సేకరణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని