logo

నిధులిచ్చేస్తే.. నాన్నొచ్చేస్తారు!: వేడుకల్లో బాలినేని ప్రణీత్‌రెడ్డి వ్యాఖ్యలు

‘ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాన్న(బాలినేని శ్రీనివాసరెడ్డి) హామీ ఇచ్చారు.

Updated : 15 Jan 2024 08:17 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాన్న(బాలినేని శ్రీనివాసరెడ్డి) హామీ ఇచ్చారు. వాటి కోసమే వేచి ఉన్నారు. రెండు రోజుల్లో రూ.170 కోట్లు విడుదలవుతాయనే సమాచారం ఉంది. ఆ తర్వాత నాన్న ఒంగోలు వచ్చేస్తారు..’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఏటా సంక్రాంతి వేడుకల్లో ఒంగోలులో గడిపే బాలినేని ఈసారి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

 చెల్లుబాటు కాకున్నా.. చాలా..!: ఇళ్లస్థలాలకు నిధులతో పాటు జిల్లా రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు కావాలనేది బాలినేని భావన. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావులకు టికెట్‌ కోసమూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాగుంట విషయంలో అధిష్ఠానం భిన్నాభిప్రాయంతో ఉండగా.. దర్శి నుంచి పోటీ కోసం శిద్దా పట్టుబట్టారు. ఒంగోలు నుంచి ససేమిరా అన్నారు. చివరికి దర్శి సమన్వయకర్త బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. మాగుంటకు టికెట్‌ లేదనే స్పష్టత ఇచ్చేసింది. ఒంగోలు పార్లమెంట్‌కు వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇళ్ల స్థలాలకు నిధులొస్తే నాన్నొచ్చేస్తారు సరే.. ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ఒంగోలును వీడి నెలయ్యే...: బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు నెల రోజులుగా అందుబాటులో లేరు. డిసెంబర్‌ 12న తన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ఇంతలోనే ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైకాపా అధిష్ఠానం నియమించేసింది. మూడు రోజులపాటు నిరీక్షించినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్‌ తలుపులు తెరుచుకోకపోవడంతో కినుక వహించారు. ఆపై రాజకీయంగా ఆయన పయనం ఎటనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పలువురిని విస్మయానికి గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని