logo

Markapuram: ఆ బాలుడు.. అక్రమాల లోలుడు

మార్కాపురం మున్సిపాలిటీ పాలక వర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యవహారశైలి అటు ప్రజలను, ఇటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

Updated : 13 Feb 2024 10:10 IST

వసూళ్లకు విభాగాల వారీగా లక్ష్యాలు
పన్నుల నుంచి ప్లాన్‌ వరకు మామూళ్లు

మార్కాపురం మున్సిపల్‌ కార్యాలయం ముఖచిత్రం

మార్కాపురం నేరవిభాగం, న్యూస్‌టుడే: మార్కాపురం మున్సిపాలిటీ పాలక వర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యవహారశైలి అటు ప్రజలను, ఇటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తనకు తెలియకుండా ఏ పనీ చేయొద్దంటూ ఇప్పటికే షరతులు విధించారు. ఇంటి పన్నులు మొదలుకుని నిర్మాణాలకు అనుమతుల వరకు అతని ప్రసన్నం దక్కాల్సిందే. లేదంటే ఆ దస్త్రం ముందుకు కదలదు.

చెబితేనే చేస్తానంటూ స్వామి భక్తి.. పురపాలక వర్గంలో కీలక నేత సమీప బంధువు ఒకరు ఇటీవల పెట్రోల్‌ బంక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నులకు సంబంధించి రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసేందుకు ససేమిరా అనడంతో కొత్త ఎత్తుగడ వేశారు. ఆ స్థానాన్ని రెండుగా విభజించారు. గిద్దలూరు నుంచి తన విధేయుడైన అధికారి ఒకరిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. అతనితో వసూళ్ల దుకాణం తెరిచారు. ఇందులోనూ అతను స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. సదరు నేత చెప్పనిదే ఏ పనీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు.

కాదంటే తప్పవు కొర్రీలు.. గతంలో ఎవరైనా కొత్తగా నిర్మాణం చేసుకుంటే సిబ్బంది పదేపదే ఆ ఇంటి చుట్టూ తిరిగి పన్నులు వేసేవారు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న వ్యక్తులే కొందరు రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అడిగినంత సమర్పించుకుంటే అటూఇటుగా ఇంటి పన్ను విధిస్తున్నారు. కాదంటే మాత్రం ఎక్కడి దస్త్రం అక్కడే ఉంటుంది. పైగా కొర్రీలు పెట్టి పని ముందుకు సాగకుండా చేస్తున్నారు. విధి లేని పరిస్థితిలో యజమానులు అడిగినంత సమర్పించుకొని పని పూర్తి చేయించుకుంటున్నారు.

తప్పుడు లెక్కలతో  బెదిరింపులు..

వాస్తవంగా ఉన్న స్థలం, అందులోని నిర్మాణం, అంతస్తుల ఆధారంగా రెవెన్యూ విలువ లెక్కించి పన్ను విధించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం తప్పుడు అంకెలు చూపి అడ్డగోలుగా దండుకుంటున్నారు. ఖాళీ స్థలం అంచనా నాటి నుంచి మూడు సంవత్సరాల క్రితం వరకు మాత్రమే వీఎల్టీ విధించాల్సి ఉంటుంది. పురంలో మాత్రం రిజిస్ట్రేషన్‌ అయినప్పటి నుంచి కట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో యజమానులు ఆందోళనతో అడిగినంత ముట్టజెబుతున్నారు. కొత్తగా ఇళ్లకు అవసరమైన కుళాయి, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు.. ఇతర మౌలిక వసతులు కావాలంటే ఇంటిపన్ను రశీదు తప్పనిసరి. ఇదే ఆసరాగా రెవెన్యూ విభాగంలోని కొందరు ఇన్‌స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సచివాలయంలోని కార్యదర్శులను గుప్పెట్లో పెట్టుకుని సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయకుండా అడ్డుకుంటున్నారు. అడిగినంత ముట్టజెప్పిన తర్వాతే దస్త్రాలు ముందుకు కదులుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ సదరు నేత కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అవినీతి వ్యవహారం మరింత పెరిగింది. దీంతో అతనిపై కార్యాలయ సిబ్బందితో పాటు తోటి ప్రజాప్రతినిధులూ ఈసడించుకుంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని