logo

Y‌SRCP: బస్సెక్కడమే ఆలస్యం.. బిర్యానీ..మద్యం ‘సిద్ధం’!

వైకాపా అధిష్ఠానం చెబుతున్న గొప్పలు.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులకు చుక్కలు చూపుతున్నాయి.

Updated : 10 Mar 2024 07:50 IST

జన సమీకరణకు వైకాపా ప్రలోభాల పర్వం
సభకు రావాలంటూ వేడుకల్లోనూ బలవంతం

ఒంగోలు, ఈనాడు- ఒంగోలు, న్యూస్‌టుడే: వైకాపా అధిష్ఠానం చెబుతున్న గొప్పలు.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులకు చుక్కలు చూపుతున్నాయి. లక్షల మందితో బాపట్ల జిల్లా మేదరమెట్లలో సభ నిర్వహించనున్నామంటూ గత కొద్ది రోజులుగా బీరాలు పలుకుతున్నారు. ఇందుకుగాను నియోజకవర్గాల వారీగా లక్ష్యాలు నిర్దేశించి జనాన్ని తీసుకు రావాల్సిందేనంటూ హుకూం జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలేమో ద్వితీయ శ్రేణి నేతలపై ఆ బాధ్యతల భారం మోపుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో వారేమో గ్రామ స్థాయి నాయకులకు బదలాయిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ అనుకున్నంత కాకున్నా.. ఎలాగోలా కొందరినైనా తరలించేందుకు తంటాలు పడుతున్నారు. ఆలయాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల వేడుకల్లోనూ సభకు రావాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు. బస్సెక్కిన వెంటనే బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు సిద్ధమంటూ ఊరూరా తెర చాటుగా తెగ ప్రచారం చేస్తున్నారు. హాజరైతే చాలు రూ.500 నోటంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇంతా చేసి అనుకున్న స్థాయిలో జనం రాకపోతేనో, వాహనాలు ఖాళీగా ఉంటేనో.. తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక జనాన్ని సమీకరించాల్సిందేనంటూ వాలంటీర్లు, ఆర్పీలపై ఒత్తిడి తెస్తున్నారు.

జనం కోసం ఒంగోలు నగరంలో నిలిపి ఉంచిన బస్సులు

కస్సు‘బస్సు’మంటున్న నాయకత్వం...: అధికారం చేతిలో ఉంది.. ఆర్థిక బలమూ ఉంది. ఆడమన్నట్లు ఆడే అధికార యంత్రాంగం తోడుగా ఉండనే ఉంది. ఇంకేం ఆర్టీసీ, రవాణా శాఖలు వందలకొద్దీ బస్సులను ఇప్పటికే బలవంతంగా సిద్ధం చేశాయి. జిల్లాలోనే సుమారు వెయ్యికి పైగా అధికారిక వాహనాలనే వినియోగిస్తున్నారు. ప్రైవేట్‌ వాటిని కూడా వందలకొద్దీ పోగేశారు. వాహనాలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తే వాటిని నింపే బాధ్యతను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు స్థానిక నాయకత్వాలకు అప్పగించారు. జిల్లాలో ఒక్కో గ్రామానికీ అయిదు నుంచి పది బస్సులు కేటాయించారు. ఇక్కడే పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. తాయిలాలన్నీ వాలంటీర్లకు, ఆర్పీలకు పంచేసి జన సమీకరణ బాధ్యత మాకు అప్పగించేస్తే ఎలాగంటూ క్షేత్రస్థాయి నాయకత్వం కస్సుబస్సుమంటోంది. వెరసీ బస్సులు నింపే బాధ్యత ఇప్పుడు అందరికీ తలనొప్పిగా మారింది. సమీకరణలో తేడా వస్తే తమకెక్కడ తల బొప్పి కడుతుందనే ఆందోళన ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను ఇప్పుడు వేధిస్తోంది.

రంగంలోకి అధికార యంత్రాంగం...: మేదరమెట్ల సభకు లక్షల మందిని సమీకరించాలని అధికార వైకాపా లక్ష్యంగా ఎంచుకుంది. అందుకు అనుగుణంగా నేతలు దిశానిర్ధేశం చేశారు. ఇంతమందిని సమీకరించడం స్థానిక నాయకత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ప్రజాప్రతినిధులతో పాటు కొన్నిచోట్ల అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. దరిమిలా  వాలంటీర్లు, ఆర్పీలను గ్రామాల్లోకి పంపుతున్నారు. సిద్ధం సభకు హాజరై తీరాల్సిందేనంటూ జనంపై ఒత్తిడి చేయిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కచ్చితంగా రావాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారు.

మహిళలకు నగదు ఎర...

సభకు హాజరు కావాలంటూ క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఆర్పీలు, ద్వితీయశ్రేణి నాయకులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్న వైకాపా.. అదేస్థాయిలో ప్రలోభాలకు కూడా రంగం సిద్ధం చేసింది. సిద్ధం సభకు హాజరయ్యే పురుషులకు బిర్యానీ పొట్లం, మద్యం సీసాలు అందిస్తామని చెబుతున్నారు. బస్సు ఎక్కగానే అందజేస్తామంటూ ప్రలోభాల ఎర వేస్తున్నారు. మహిళలకు భోజనంతో పాటు రూ.500 ఇస్తామని, సభకు హాజరు కావాలని చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సభకు హాజరయ్యే వారికి రోజు కూలిగా రూ.750 వరకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులు ఉద్యోగులు, చిరుద్యోగులకు చికాకుగా మారాయి.

ప్రయాణికులపై ఎందుకీ యుద్ధం

స్వస్థలాలకు వెళ్లలేక సామగ్రితో వేచివున్న దృశ్యం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కనిపించిన దృశ్యాలివి. డిపోలో మొత్తం 133 బస్సులుండగా... వీటిలో డెబ్భై వరకు బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు అధికారులు కేటాయించారు. సాయంత్రం నుంచే వాటిని జన సమీకరణ పేరుతో వివిధ ప్రాంతాలకు పంపేశారు. దీంతో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రత్యామ్నాయ వాహనాల్లో స్వస్థలాలకు వెళ్లగా.. ఆ అవకాశం లేని వారు బస్టాండ్‌లోనే పడిగాపులు పడుతూ ఉండిపోయారు.

ఈనాడు, ఒంగోలు

ఎంతకీ బస్సు రాకపోవడంతో బస్టాండ్‌లోనే నిద్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని