logo

AP News: సిద్ధమంటూ ఏంటీ యుద్ధం!.. జగన్‌ సభకు ఆర్టీసీ బస్సుల మళ్లింపు

సీఎం జగన్‌ యాత్రలంటే చాలు ఆర్టీసీ అధికారులు అమితమైన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అడిగిన సంఖ్య కంటే ఎక్కువ బస్సులను అప్పనంగా అప్పగిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు.

Updated : 07 Apr 2024 08:32 IST

ఎండల్లో అల్లాడిన ప్రయాణికులు

1. ఎక్కాల్సిన బస్సులు ఎప్పుడొస్తాయో తెలియదు...: వెలవెలబోతున్న
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌.. పడిగాపులు పడుతున్న ప్రయాణికులు

ఒంగోలు అర్బన్‌, మార్కాపురం అర్బన్‌ - న్యూస్‌టుడే: సీఎం జగన్‌ యాత్రలంటే చాలు ఆర్టీసీ అధికారులు అమితమైన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అడిగిన సంఖ్య కంటే ఎక్కువ బస్సులను అప్పనంగా అప్పగిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి చుక్కలు చూపుతూ నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు. బస్టాండ్లలో పిల్లాపాపలతో గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దయనీయ పరిస్థితిని చేజేతులారా కల్పిస్తున్నారు.

2. నావల్ల కాదు: నిల్చునే ఓపిక లేక ప్లాట్‌ఫాం వద్ద నీరసంగా కూర్చున్న ఓ వృద్ధుడు

పొరుగు జిల్లాకు పంపేశారు...: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు తెర లేపారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ యాత్రకు జిల్లా నుంచి 210 బస్సులను అధికారులు మళ్లించారు. ఒంగోలు డిపో నుంచి 48, మార్కాపురం నుంచి 58, గిద్దలూరు నుంచి 42, పొదిలి నుంచి 30, కనిగిరి డిపో నుంచి 32 బస్సులు కేటాయించారు. దీంతో అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినవారు, గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు బస్టాండ్‌లకు చేరుకుని బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. పలువురు ప్రైవేట్‌ వాహనాల్లో అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణాలు చేయగా.. మరికొందరు గంటల తరబడి వేచి ఉన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు విజయవాడ, ఒంగోలు వెళ్లేందుకు మార్కాపురం చేరుకున్న పలువురు యాత్రికులు ఎండ వేడికి విలవిల్లాడారు. జగన్‌ యాత్ర అంటే ఆర్టీసీ అధికారులు స్వామి భక్తిని చాటుకుంటూ జనానికి నరకం చూపడంపై పలువురు మండిపడ్డారు.

3. ఊరికి చేరే దారేదీ.!: కుర్చీలో దిగాలుగా ఓ యువకుడు

4. నిరీక్షించి.. నీరసించి...: బస్టాండ్‌లోని కుర్చీల్లో కునుకు తీస్తున్న ఓ మహిళ

మోకాలి నొప్పితో బాధ పడుతూ కర్రను ఊతంగా చేసుకుని నిల్చున్న ఓ ప్రయాణికుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు