logo

హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!

అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 30 Apr 2024 03:40 IST

విద్యార్థులతో ప్రచారం
మార్కాపురంలో వైకాపా బరితెగింపు

కళాశాల యూనిఫాంలో వైకాపా ర్యాలీకి హాజరైన విద్యార్థులు

మార్కాపురం నేరవిభాగం, న్యూస్‌టుడే: అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురం పట్టణంలో అధికార వైకాపా ఆధ్వర్యంలో ఐటీ వింగ్‌ నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదమైంది. ర్యాలీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసినా స్పందన కరవైంది. దీంతో వైకాపా నేతలకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులను దీనికి తరలించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.షంషీర్‌ అలీబేగ్‌, యర్రగొండపాలెం పరిశీలికులు వెన్నా హనుమారెడ్డిలకు చెందిన ఏ1 గ్లోబల్‌, ఇందిరా ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులను బస్సుల్లో అక్కడికి తరలించారు. కళాశాల యూనిఫాంలతోనే వారు పార్టీ జెండాలు, ప్ల కార్డులను పట్టుకుని దీనంగా పార్టీ శ్రేణుల్ని అనుసరించారు. పార్టీ పాటలు, డీజే శబ్ధాలతో ప్రధాన రహదారిపై నేతలు నానాయాగీ సృష్టించారు. ర్యాలీలో మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అలీబేగ్‌, రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మన్‌ జంకె వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత జరిగినా అధికారులెవరూ దీన్ని నిరోధించలేదు. ర్యాలీతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించి వాహన దారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం తమ కళాశాలలకు సెలవులు ఇవ్వకుండా ఓట్లు వేసిన తరువాతనే ఊర్లకు వెళ్లాలని హుకుం జారీ చేశారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో నిలిచిన ట్రాఫిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని