logo

మీకంటే రౌడీషీటర్లు నయం

‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు.

Published : 01 May 2024 03:00 IST

సమీక్షలో ఐజీ ఆగ్రహం

మాట్లాడుతున్న సర్వశ్రేష్ట త్రిపాఠి.. చిత్రంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. అధికారం ఉండీ మీరేమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో మీరు బెటరా! రౌడీషీటర్లు బెటరా!!’ అని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి టంగుటూరులో మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఐజీ త్రిపాఠి ఒంగోలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కొందరి వ్యవహార తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌బాబు, జిల్లాలోని డీఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని