logo

అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..

‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు.

Updated : 07 May 2024 05:11 IST

జమ కాని విద్యా దీవెన నగదు
అప్పులు చేసి బకాయిల చెల్లింపు

‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు.

క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రులో ఈ ఏడాది మార్చి 1న నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌- డిసెంబర్‌, 2023 త్రైమాసికానికి జిల్లాలోని 47,422 మంది విద్యార్థులకు సంబంధించి రూ.36.44 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా అధికారులు కూడా ప్రకటించారు. రెండు నెలలు గడిచినా ఇంతవరకు సగానికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ కాలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా అందించాల్సి ఉంది. అందులో మొదటి విడత నగదే విడుదల కాలేదు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ప్రచారం కోసం విధానాల మార్పు...: గతంలో బోధనా రుసుం నేరుగా కళాశాలలకే జమయ్యేది. తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేసేవి కావు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్‌ డబ్బులిస్తున్నారన్న విషయం తల్లిదండ్రులకు తెలియాలంటూ విధానాన్ని మార్చారు. తల్లుల ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తల్లిదండ్రులకు శాపంగా మారింది. ప్రభుత్వం జమ చేసే డబ్బు మీరే ఉంచుకోండి, మాకు మాత్రం ముందు ఫీజులు కట్టండంటూ కళాశాలల నుంచి ఒత్తిడి పెరిగింది.


విద్యార్థులపై విద్యా సంస్థల ఒత్తిళ్లు

ఇంజినీరింగ్‌తో పాటు, ఇతర డిగ్రీ కోర్సుల విద్యా సంవత్సరం ముగిసింది. దీంతో ఫీజులు చెల్లించాలని సదరు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు పలు కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదా విదేశాల్లో ఉన్నత చదువు నిమిత్తం వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు అత్యవసరం. ఇదే ఆసరాగా కళాశాలల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లకు మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో అప్పులు చేసైనా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు తలెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని