logo

నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’

ఏటా జాబ్‌ క్యాలెండర్‌..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్‌ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు.

Updated : 07 May 2024 06:27 IST

ఉపాధ్యాయ ఉద్యోగాల్లేవ్‌
కానిస్టేబుల్‌ కొలువులూ రాలే..
కోడ్‌ ముంగిట నోటిఫికేషన్ల నాటకం
అయిదేళ్లుగా కుంగిపోతున్న యువత

ఏటా జాబ్‌ క్యాలెండర్‌..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్‌ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. కలయా..నిజమా అంటూ ఆనంద బాష్పాలు రాల్చిన నిరుద్యోగులకు అనతికాలంలోనే ముఖ్యమంత్రి అసలు రూపం సాక్షాత్కరించింది. ఉపాధ్యాయ నియామకాలు..కానిస్టేబుల్‌ కొలువులు..అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ వంటివన్నీ ఆయన సృష్టించిన మాయా ప్రపంచంలో భాగమేనని, యువత ఓట్ల వేట కోసం సాగించిన జగన్నాటకమని తెలిసి హతాశులయ్యారు. ఏ ఉపాధీ లేక కుటుంబానికి భారంగా మారామని జిల్లాలోని డెబ్భైవేల మంది ఉద్యోగార్థులు మౌనంగా  రోదిస్తున్నారు.   

ఒంగోలు నగరం, కనిగిరి- న్యూస్‌టుడే

ముఖ్యమంత్రిగా జగన్‌ అధికార పీఠమెక్కిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లను విస్మరించడంతో జిల్లాలోని డెబ్భై వేల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌తో అన్ని శాఖల్లోని పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ఇచ్చిన హామీ నీటిలో రాతలా మిగిలిందని వారు వాపోతున్నారు. కేవలం వైద్య, విద్యాశాఖలో కొన్ని ఒప్పంద పోస్టులు భర్తీ చేసి అవే ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పడంతో వారంతా కంగుతున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ట్రిపుల్‌ ఐటీ, ఫార్మసీ, నర్సింగ్‌, బీఎడ్‌, డీఎడ్‌, టెక్నికల్‌ కోర్సులు చదివిన వారంతా ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.

బాబు ప్రకటనతో కనిగిరిలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు

ఆఖర్లో డీఎస్సీ అంటూ హడావుడి..

డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మూడేళ్ల నుంచి చెబుతున్న ప్రభుత్వం తీరా ఎన్నికల ప్రకటనకు రెండు నెలలు ముందు నోటిఫికేషన్‌ ఇచ్చింది. టీచర్‌ అర్హత పరీక్ష టెట్‌ నిర్వహించారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ వచ్చిందంటూ డీఎస్సీ పరీక్షకు మంగళం పాడేశారు. దీంతో జిల్లాలో టెట్‌ రాసిన  7200 మంది తీవ్ర నిరాశచెందారు. టీచర్‌ పోస్టుకు అర్హత వయసు ఓసీలైతే 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలైతే మరో అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. 2018 తరువాత డీఎస్సీ జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు గడిచిన ఏడేళ్లలో టీచర్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు 20 వేల మంది ఉంటారని అంచనా.

డీఎస్సీ ప్రకటించాలని కనిగిరిలో నిరుద్యోగుల ఆందోళన

సర్కారు తీరుతో బీఎడ్‌, డీఎడ్‌పై నిరాసక్తత

ఆరేళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో టీటీసీ, బీఎడ్‌, డీఎడ్‌పై నిరాసక్తత పెరిగిపోయింది. ఈ శిక్షణలు తీసుకునేవారి సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో 70 బీఎడ్‌ కళాశాలలుండగా, దాదాపు 30 కళాశాలల్లో చేరికలు వేళ్లమీద లెక్కించవచ్చు. సెకండరీ గ్రేడ్‌ పోస్టులు తగ్గిపోవడంతో ప్రైవేటు కళాశాలల్లో టీటీసీ ఎత్తివేశారు. ఒక్క మైనంపాడు డైట్‌లో మాత్రమే ఉంది. అక్కడ వంద సీట్లకు గాను 50 మాత్రమే భర్తీ అయ్యాయి. కనీసం మూడేళ్లకు ఒకసారైనా డీఎస్సీ నిర్వహిస్తే కోర్సుల్లో చేరేవారుంటారని చెబుతున్నారు.

పోలీసు ఉద్యోగాలూ ఉత్తుత్తే

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ వస్తుందని ఎంతోమంది ఎదురుచూసి నిరాశచెందారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తారని భావించినా అదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకమంటూ నిరుద్యోగులు వాపోయారు. జిల్లాలో ఏటా ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు 28 వేల మంది ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేసేవారు 8 వేలమంది, ఇంజినీరింగ్‌ కోర్సులు చేసేవారు 6 వేల మంది ఉంటున్నారు. జిల్లాలో, రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలు, దేశాలకు విద్యార్థులు వలస పోతున్నారు. ఆర్థిక స్తోమత గల వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వెళ్లి అక్కడ ఏదో ఉద్యోగంలో చేరుతున్నారు. ఎటు తిరిగి పేద విద్యార్థులే ఉపాధి లేక బలై పోతున్నారు.

విలీనంతో టీచర్లపై మరో దెబ్బ

వైకాపా ప్రభుత్వం 117 జీవో తెచ్చి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశాక పాఠశాలల్లో పోస్టులు తగ్గిపోయాయి. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 1500 ఉపాధ్యాయ పోస్టులను జిల్లా కోల్పోయింది. ఇవికాక జిల్లాలో పన్నెండు వందలకు పైగానే టీచర్‌ ఖాళీలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ కాకి లెక్కలని, వేలల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని నిరుద్యోగులు అంటున్నారు.

రూ. లక్షలు ఖర్చుచేసినా దిక్కుతోచక..

టీటీసీˆ, బీఎడ్‌, భాషా పండిత కోర్సులు పూర్తి చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కనిగిరి, ఒంగోలు, పక్క జిల్లాలైన గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూల్‌ నుంచి ప్రైవేటు కేంద్రాల్లో డీఎస్సీ శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు.  సొంతూరుకు దూరంగా అద్దె గదుల్లో ఉంటూ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు. దీనికోసం రూ. వేలకు వేలు ఖర్చు చేశారు. నిరుపేద అభ్యర్థులు చిన్నా చితకా పనులు చేసుకుని సంపాదించిన డబ్బును కూడబెట్టుకుని కనిగిరికి వచ్చారు. ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు.


చంద్రన్న ప్రకటనతో మళ్లీ శిక్షణలకు..

తాము అధికారంలోకి వస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేస్తామని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడంతో  నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయిదేళ్లుగా నీరుగారిపోయిన అభ్యర్థులు మళ్లీ శిక్షణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. తెదేపా హయాంలో తప్పనిసరిగా డీఎస్సీలు నిర్వహించి వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో వారు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే చంద్రబాబు డీఎస్సీ ప్రకటిస్తారన్న ధీమాతో వారు కనిగిరి ప్రాంతానికి చేరుకోవడంతో మళ్లీ కోలాహలం మొదలైంది. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు.

26,000 పోస్టులంటూ అంటూ బీరాలు

తాము అధికారంలోకి రాగానే అక్షరాలా 26 వేల పోస్టులు భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీని విడుదల చేస్తామని అయిదేళ్ల క్రితం జగన్‌ బీరాలు పలికారు. దీంతో ఉపాధ్యాయ శిక్షణలకు పేరు గాంచిన కనిగిరి ప్రాంతానికి వేలాదిమంది నిరుద్యోగులు తరలివచ్చారు. అప్పులు చేసి డబ్బులు సమకూర్చుకుని శిక్షణలు తీసుకున్నారు. అయిదేళ్లుగా డీఎస్సీ వంక చూడని జగన్‌, కోడ్‌ ముంచుకొస్తున్న వేళ డీఎస్సీ 2024 అంటూ ప్రకటన జారీ చేశారు. ఈ హడావుడికి తోడు టెట్‌ పరీక్షలో అర్హత సాధించాలంటూ మెలిక పెట్టారు. తీరా చూస్తే జిల్లాలో 800 పోస్టులకు గానూ కేవలం 322 మాత్రమే కేటాయించడంతో వారంతా నీరుగారిపోయారు.



ఆశంతా ఆవిరైంది

చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలన్నది నా ఆశ. 2016-18 మధ్యలో డీఎడ్‌ పూర్తి చేశా. 26 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తానని అప్పట్లో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడంతో సంబరపడ్డాను. అయిదేళ్లుగా ఎదురుచూసి ఆశలు ఆవిరయ్యాయి. సుదూరంగా ఉన్న కుప్పం నుంచి వచ్చి కనిగిరిలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. అయిదేళ్ల కాలం వృథా అయ్యింది.

 కల్యాణ్‌, కుప్పం


బాబు హామీతో జీవితంపై భరోసా 

మెగా డీఎస్సీ అని జగన్‌ చెప్పడంతో గత ఎన్నికల్లో మాలాంటి నిరుద్యోగులు ఓటు వేశారు. అయితే ఈ అయిదేళ్లలో మా గురించి పట్టించుకోలేదు. శిక్షణ పూర్తిచేసిన ఒకటి రెండేళ్లలో నోటిఫికేషన్లు వస్తే ఉపయోగం. చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ మీద అనడంతో మళ్లీ జీవితాలు మారతాయన్న భరోసా కలిగింది.

నాగేంద్ర, మార్కాపురం


తీవ్రంగా నష్టపోయాం

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు. తల్లిదండ్రులకు దూరంగా అద్దె ఇళ్లలో ఉంటూ శిక్షణ తీసుకున్నాం. తీవ్రంగా నష్టపోయాం.

 సుభలత, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని