logo

విష కౌగిలి.. ఊపిరే బిగపట్టి

జగన్‌ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది.

Updated : 10 May 2024 05:14 IST

అయిదేళ్లుగా ఆటవిక రాజ్యం
ఈనాడు, ఒంగోలు; మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే

జగన్‌ అయిదేళ్ల రాజ్యంలో ఊరూరా వైకాపా నాయకుల అసుర గణం తయారైంది. అభివృద్ధి అనే మాటే మరిచింది. అరాచక పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ప్రత్యర్థులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది. అక్రమాలపై ప్రశ్నిస్తే వెంటాడి ప్రాణాలు తీసేంత కర్కశత్వాన్ని జె గ్యాంగ్‌ ముఠా అలవర్చుకుంది. వీరికి సిఫార్సులతో పోస్టింగులు తెచ్చుకున్న కొందరు పోలీసులు తోడయ్యారు. స్వామిభక్తి ప్రదర్శనలో పోటీ పడ్డారు. సామాన్యులపై విరుచుకుపడ్డారు. పోలీస్‌ స్టేషన్లనే సివిల్‌ పంచాయితీ వేదికలుగా మార్చారు. బాధితులు స్టేషన్‌ మెట్లు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితులు సృష్టించారు.


ఫిర్యాదులూ స్వీకరించలేదు...

మార్కాపురంలోని ఓ స్టేషన్‌లో సివిల్‌, ఆర్థిక, భూ వివాదాల్లో సామాన్యులను పదే పదే స్టేషన్లకు పిలిపించి ఇబ్బందులకు గురి చేశారు. వైకాపా నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సామాన్యులు చేసే ఫిర్యాదులను కూడా కనీసం స్వీకరించలేదు. మరోవైపు ముఖ్య ప్రజాప్రతినిధి సోదరుడికి ప్రధాన అనుచరుడిగా పేరున్న ఓ లిక్కర్‌ వ్యాపారి చెప్పిందే వేదంగా ఎస్సైలు పని చేశారు.


చెట్టు కిందే సెటిల్‌మెంట్లు...

మంత్రిగా చేసిన ఓ నేత ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పని చేసిన పోలీసు సీఐ అధికారి ప్రజల హక్కుల్ని అణచివేశారు. వైకాపా నాయకులతో కలిసి సివిల్‌, భూవివాదాలకు సంబంధించిన పంచాయతీలన్నీ చెట్టు కిందే చేసి జేబులు నింపుకొన్నారు. మంత్రితో పాటు చోటా నాయకులు చెప్పిందే వేదంగా విధులు నిర్వహించారు.


ఫిర్యాదు చేశారని హత్య

ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారంటూ వైకాపా నాయకులపై సీఎస్‌ఫురం మండలం ఏకునాంపురానికి చెందిన దాసరి వెంకట రమణయ్య అనే చర్చి పాస్టర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు ఆయన్ను కడతేర్చారు.


టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన సవళం హనుమాయమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంటారు. ఇంటి వద్ద ఉన్న ఆమెను అదే గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. కిందపడిన తర్వాత గొర్రుతో అతి కిరాతకంగా హతమార్చారు.


దళిత యువకుడు బలి...

రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి అండతో అక్కడి సీఐ రెచ్చిపోయారు. అతని చేష్టలతో ఓ దళిత యువకుడు గతేడాది డిసెంబరు 12న ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండేళ్లపాటు ఆయన సాగించిన వికృత విధానాలతో ఎందరో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతిపక్ష నాయకుల్ని తరచూ స్టేషన్లకు పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం, కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేసిన ఉదంతాలు కోకొల్లులు.


అర్ధరాత్రి కర్రలతో దాడి

తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ప్రభుత్వ భూమి ఆక్రమించి గ్రావెల్‌ తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారంటూ.. ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఇద్దరు వైకాపా నాయకులు అర్ధరాత్రి వేళ కర్రలతో దాడి చేశారు. అయినా అక్కడి వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో కేసును నీరుగార్చారు.


సభకు వెళ్లాడని చంపేశారు...

  • గిద్దలూరులో పాముల మునియ్య అనే వ్యక్తి వైకాపా మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం సభకు వెళ్లేందుకు నిరాకరించారు. తెదేపా మహానాడుకు స్థానికులను తీసుకెళ్లారు. దీంతో కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు ఇంటి వద్ద నిద్రిస్తుండగా మునియ్యను గొడ్డలితో నరికి చంపారు. తనకు ప్రాణహాని ఉందంటూ అంతకుముందే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
  • పొలం అమ్మలేదనే కారణంతో కనిగిరి మండలం మండాదివారిపల్లిలో ఓ రైతు ఇంటి చుట్టూ వైకాపా నాయకులు ఏకంగా కంచె వేసి బయటికి రాకుండా చేశారు. 

వెంటాడి కడతేర్చి

భూవివాదాల నేపథ్యంలో స్థిరాస్తి వ్యాపారి అచ్యుత నారాయణను కొందరు వైకాపా నాయకులు రెండేళ్ల క్రితం యర్రగొండపాలెంలో హతమార్చారు. వాహనంతో వెంటాడి ఢీకొట్టి కిరాతకంగా కడతేర్చారు. తనకు ప్రాణహాని ఉందని ముందుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదే అదునుగా వైకాపా నేతలు రెచ్చిపోయారు. బరితెగించి మరీ ప్రాణాలు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని