logo

గీత దాటితే వేటు తప్పదు

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను   ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Published : 28 Mar 2024 05:23 IST

న్యూస్‌టుడే, రణస్థలం: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను   ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కొందరు ప్రలోభాలకు గురి చేసేందుకు సైతం వెనుకాడట్లేదు. ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించాల్సిందే. ఎవరైన ఉల్లంఘిస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. కేసులు నమోదు చేసి.. నేరం రుజువైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవేంటో తెలుసుకుందాం రండి..


ఓటర్లను బెదిరిస్తే: ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా హక్కును వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ఓటర్లను ఒత్తిడికి గురి చేయడం, బెదిరించడం తీవ్రమైన నేరం. ఎవరైనా అలా చేసినట్లు రుజువైతే బాధ్యులపై ఐపీసీ 171(సీ) చట్టం కింద కేసు నమోదవుతుంది.


కానుకలు, నగదు పంపిణీ చేస్తే: ఓటర్లకు మద్యం, కానుకలు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేయకూడదు. అన్నదానాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 171(ఇ) చట్టం కింద శిక్షార్హులవుతారు. అక్రమంగా చెల్లింపులు చేస్తే ఐపీసీ 171(హెచ్‌) సెక్షన్‌ కింద, అధికారులకు లంచం రూపంలో డబ్బులిచ్చినా, ఓటర్లుకు పంపిణీ చేసినా ఐపీసీ 171(బి) సెక్షన్‌ కింద చర్యలు తీసుకునే అవకాశముంటుంది.


ఖర్చులు సమర్పించకుంటే: పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు పోలింగ్‌ ముగిసిన నెలలోగా సమర్పించాలి. లేకుంటే 171(ఐ) సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు.


ప్రచార సమయం మించితే: అభ్యర్థులకు కేటాయించిన సమయాన్ని మాత్రమే ప్రచారానికి వినియోగించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మైకులు వాడటమూ నేరమే. దీనికిగాను ఐపీసీ 171(ఎఫ్‌) చట్టం కింద కేసు పెట్టొచ్చు.


లేనిది ఉన్నట్లు చెప్పినా : ప్రచారం చేసే అభ్యర్థులు ప్రజలను ఆకర్షించేందుకు ఒక్కోసారి అబద్దాలు చెబుతుంటారు. లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు. దీనిపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఐపీసీ 171(జి) కింద చర్యలు తీసుకునేందుకు ఆస్కారముంది.


మద్యం పంపిణీ చేస్తే: ఎన్నికలంటే మొదట గుర్తుకొచ్చేది మద్యం. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తుంటారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి మూడు సీసాలకు మించి తీసుకెళ్లడం నేరం. భారీ మోతాదులో మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే అబ్కారీ చట్టం 1968 సెక్షన్‌ 34(ఎ) కింద కేసు నమోదు చేస్తారు. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు.


ఫిర్యాదుకు సి-విజిల్‌..

ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను తెలిపేందుకు సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. చరవాణి నుంచే ఈ యాప్‌ ద్వారా సాక్ష్యాలతో సహా సమాచారం అధికారులకు తెలియజేయవచ్చు. ఫొటో, వీడియో, ఆడియో రూపంలో రికార్డు చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. ఫిర్యాదు చేసిన అయిదు నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. పార్టీలకతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.


విద్వేషపూరిత ప్రసంగాలకు..: ఓట్ల కోసం కులం, మత, ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరచడం వంటివి చేయకూడదు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్‌ 125 కింద కేసు నమోదవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని