Ramayana: అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్‌ ఫొటోలు వైరల్‌

ఇటీవలే షూటింగ్‌ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

Published : 27 Apr 2024 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సాయిపల్లవి (Sai Pallavi) కీలక పాత్రల్లో నితేశ్‌ తివారీ రూపొందిస్తున్న దృశ్య కావ్యం ‘రామాయణ’ (Ramayana). ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు సీతారాముల జోడీ చక్కగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఫొటోలు చూసి సినీవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. నటీనటుల గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా ఏకంగా సెట్స్‌లో ఫొటోలు లీకవడంపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు. దర్శకుడు నితేశ్‌ తివారీ, మూవీ టీమ్‌ ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఫొటోలు లీకవడం కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టినట్లైంది. దీంతో మూవీ షూటింగ్‌ విషయంలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారట. ప్రస్తుతం లీకైన ఫొటోలను బట్టి చూస్తే, అయోధ్యలోని అంతఃపురంలో సీతారాములు కలిసి విహరిస్తున్న దృశ్యాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

మొత్తం మూడు భాగాలుగా రామాయణ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో యష్ (Yash) రావణుడిగా నటించడంతో పాటు, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నవీన్‌ పొలిశెట్టి కూడా నటిస్తారని టాక్‌ వినిపించింది. అయితే, దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. తొలి భాగంలో రామాయణ బాలకాండ, అయోధ్యకాండ కీలకంగా చూపించి, తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు అడవులకు పయనమయ్యే భావోద్వేగ సన్నివేశాలతో ముగించే అవకాశం ఉంది. ఆ తర్వాత అరణ్య కాండ, కిష్కిందకాండలతో రెండో భాగాన్ని తీర్చిదిద్దనున్నారు. మూడో భాగంలో అత్యధికంగా యుద్ధకాండకు సంబంధించిన సన్నివేశాలు ఉండనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దాలని చిత్రబృందం భావిస్తోంది. దీన్నిబట్టి చూస్తే రావణాసురుడిగా యశ్‌ ఎంట్రీ రెండో భాగంలో ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన రామాయణ చిత్రాలకు దీటుగా నితేశ్‌ మూవీ ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మొదటి పార్ట్‌ 2025 దీపావళికి వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు