logo

ఖాదీ బతుకులంటే చిన్న చూపా..?

‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు.

Updated : 01 May 2024 06:50 IST

పొందూరు ఖాదీపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం
పట్టించుకోని స్పీకర్‌ తమ్మినేని సీతారాం
న్యూస్‌టుడే, పొందూరు

‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రోత్సాహం లేక భవిష్యత్తు మనుగడే లేకుండాపోయే పరిస్థితి నెలకొంది.. ఈ రంగంపై నమ్మకం లేక కొత్తతరం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం మరో ప్రధాన సమస్య.’

పొందూరు ఖాదీకి ప్రాణం పోస్తున్న శ్రామికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.. అయిదేళ్ల వైకాపా పాలనలో చేయూత లేక కష్టానికి తగ్గ ఫలితం లేక కష్టాల సుడిలో చిక్కుకుపోయారు..  అనారోగ్యం ఓపక్క.. అర్ధాకలి మరోపక్క వారి జీవితాలను చిదిమేస్తున్నాయి.. అయినా వృత్తిపై మమకారం చంపుకోలేక ఈ రంగంలోనే నెట్టుకొస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకంగా శాసన సభాపతి అయ్యారని చేనేతకు వెలుగులు తెస్తారని ఆశించిన కార్మికులకు చీకట్లే మిగిల్చారు. పొందూరు ఖాదీ రూపురేఖలు మార్చుతామని చెప్పడం తప్ప చేసిందేమీ లేకుండా పోయింది.

పొందూరు ఎఫ్‌కేకే సంఘం

వృత్తికి దూరం..

గతంలో నాలుగువేల మందిపైన స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వెయ్యి మందికే పరిమితమయ్యారు. వీవర్స్‌ వంద మందికి పరిమితమయ్యారు. గతంలో ఉన్న వృద్ధులు ఏ పనిచేయలేక ఈ వృత్తినే నమ్ముకొని కాలం వెళ్లదీసేవారు. ప్రస్తుతం యువత ఈ వృత్తిని వదిలి వేరొక పనులకు వెళ్లిపోతున్నారు. తమ తల్లిదండ్రులకు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందులను చూసి ప్రస్తుత యువత వేరొక పనులకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఖాదీ వృత్తిని నేటి యువత వదిలేస్తున్నారు.

రోజుకు రూ.100 కష్టమే

పొందూరు ఖాదీ వస్త్రాన్ని తీర్చిదిద్దటంలో రెండు రకాల నైపుణ్యమున్న కార్మికులు శ్రమిస్తున్నారు. ఒకరు పత్తి నుంచి దారం ఒడికి చిలపలను తయారు చేసేవారు (స్పిన్నర్లు) కాగా, రెండోది నేతన్నలు (వస్త్రాన్ని తయారు చేసేవారు). ఈ రెండు విభాగాల వారికీ రోజుకు గరిష్ఠంగా రూ.100 కూడా గిట్టుబాటు కాలేదు. కొందరికి రూ.50 మాత్రమే వస్తోంది. అదీ రోజంతా కళ్లు చేసుకుని పని చేస్తేనే. ఆర్థిక దన్ను కొరవడి ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథగా మారింది. ఎవరిని కదిపినా కష్టాలు కన్నీళ్లే.

సందర్శన తప్ప చేసిందేమీ లేదు..

ఖాదీకి ఊతమిచ్చేందుకు పాలకులు సందర్శించడం తప్ప ఇచ్చిందేమీ లేదు. శాసన స్పీకరు తమ్మినేని సీతారాం పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి క్లస్టర్లు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు శిక్షణ అందిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క పనిచేసిన దాఖలాలు లేవు. 2021లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వచ్చారు. పదివేల మంది ఖాదీ కార్మికులతో మెగా క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఎలాంటి పనులు కూడా జరగలేదు.

జీవితాల్లో కానరాని వెలుగులు

ఖాదీ కార్మికులపై ప్రస్తున్న ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో వారి జీవితాల్లో వెలుగులు లేకుండా పోయాయి. కుటుంబాల పోషణకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వీరు అనారోగ్యానికి  గురైనా పట్టించుకునేనాథుడే కరవయ్యారు. ఈ వృత్తిలో ఉన్నవారంతా వృద్ధులే. వయసు మళ్లీనేవారే కావడంతో వివిధ రోగాలతో బాధపడుతున్నారు. సరైన వైద్యం కూడా చేయించుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు.


ఎవరూ పట్టించుకోలేదు

50 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ప్రభుత్వపరంగా ఎలాంటి ఆదరణ లేదు. రోజంతా కష్టపడినా జీవనం కష్టంగా ఉంది. అనారోగ్యం పాలైతే పట్టించుకునేవారే లేరు. మా తరంతోనే ఈ వృత్తి అంతం అవుతుందని అనుకుంటున్నాను. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఖాదీ పరిశ్రమ మూలకు చేరుతుంది.

మలిపెద్ది సీతారాం, ఖాదీ కార్మికుడు, పొందూరు


పిల్లలు ముందుకు రాలేదు

ఈ వృత్తి మా తరంతోనే ఆగిపోతుంది. పిల్లలు ఈ పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. నా ఇద్దరు కుమారులు వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోజంతా కష్టపడినా కూలి డబ్బులు రావడం లేదు. మందులకు పిల్లలపై ఆధార పడాల్సి వస్తోంది.

జల్లేపల్లి కాంతమ్మ, ఖాదీ కార్మికురాలు, పొందూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని