logo

మాటల మంత్రి.. పలాసకు చేసిందేంటి?

పలాస ముఖచిత్రాన్ని మారుస్తామని గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీదిరి అప్పలరాజు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. కాలం కలిసి రావడంతో వైకాపా ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అయిదేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు.

Updated : 07 May 2024 08:17 IST

పదవి పొందినా కానరాని ప్రయోజనం
నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలక్కడే..
ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

పలాస ముఖచిత్రాన్ని మారుస్తామని గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీదిరి అప్పలరాజు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. కాలం కలిసి రావడంతో వైకాపా ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అయిదేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. కొండలను మింగేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ‘వెన్నలాంటి మనసు కలిగిన వాడు.. మాట కాస్త కటువుగా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు..’ అని ఆయనకు కితాబిచ్చారు. స్వలాభం తప్ప ప్రజాశ్రేయస్సును పట్టించుకోని అప్పలరాజు ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని పలాస వాసులు చర్చించుకుంటున్నారు.  

ఇప్పుడు ఏ వంతెనపై నడుస్తారు..?

ప్రస్తుత పరిస్థితి: కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు వద్ద పై వంతెనల నిర్మాణ పనులకు 2008లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే బెండిగేటు వద్ద పై వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాశీబుగ్గ పైవంతెన 2024 నాటికి కూడా పూర్తి చేయలేని పరిస్థితి. గత ఎన్నికల్లో మంత్రి అప్పలరాజు కాశీబుగ్గ పైవంతెన నిర్మాణాన్ని తెదేపా నాయకులు పట్టించుకోలేదని, మేం నాలుగేళ్లలో పూర్తి చేసి జనసందోహంతో  పై వంతెనపై నడుచుకుంటూ వెళ్లి మళ్లీ ఓట్లు అడుగుతామని గొప్పలకు పోయారు. వంతెన నిర్మాణానికి స్థలం ఇచ్చిన వారికి పరిహారం, ప్రభుత్వ స్థలాల కేటాయింపులో జాప్యం జరగడంతో వంతెన ఒకవైపు కూడా పూర్తి కాలేదు.  


రైతులను రోడ్డెక్కించారు...

ప్రస్తుత పరిస్థితి: కాశీబుగ్గ న్యూకాలనీ సమీపంలో వెనుకబడిన సంక్షేమ వసతి గృహం ఆవరణలో రైతు బజారు ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఆ స్థలం తమ వర్గానికి చెందినదంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక మేం రైతు బజారు ఏర్పాటు చేస్తామని అప్పలరాజు ప్రకటించారు. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద ప్రాథమిక పాఠశాల ఆవరణలో రాజన్న బజారు అంటూ అట్టహాసంగా ప్రారంభించారు. రెండు రోజులకే రైతులు అక్కడికి వెళ్లకుండా రోడ్ల పక్కన, ఇతర ప్రదేశాల్లో దుకాణాలు పెట్టుకున్నారు.  


కలగానే కళాశాల నిర్మాణం

ప్రస్తుత పరిస్థితి: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని గదుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత కళాశాలలో బోధనేతర పోస్టులు తమకు అనుకూలమైన వ్యక్తులకే కట్టబెట్టారు. డిగ్రీ కళాశాల శాశ్వత భవనం కోసం ఇంగిలిగాం ప్రాంతంలో కొండల వద్ద స్థల పరిశీలనకే పరిమితమయ్యారు. భవనాల కోసం నిధులు కేటాయించకపోవడంతో పలాస ప్రభుత్వ పాఠశాలలోనే డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు.


సాగునీరు ఇవ్వలేకపోయారు..

ప్రస్తుత పరిస్థితి: మందస మండలంలో కళింగదళ్‌ గెడ్డపై రూ.కోటితో దోనె నిర్మాణానికి మూడు సార్లు అంచనాలు తయారుచేశారు. ఐదేళ్లు గడిచినా అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. తెదేపా హయాంలో సుమారు రూ.63 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం ప్లాస్టిక్‌ గొట్టాలను ఏర్పాటు చేయడంతో 300 నుంచి 400 ఎకరాలకు నీరందిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే మందస మండలం, సమీప గ్రామాల్లోని సుమారు 1,600 ఎకరాలకు సాగునీరందుతోంది. జంతిబందను జలాశయంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. తెదేపా హయాంలో రూ.1.30 కోట్లు మంజూరు చేసినా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అవి ఎక్కడికక్కడే ఆగిపోయాయి.


వీటి గురించి మార్చిపోయారా?

ఇవే కాకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పలాస అభివృద్ధికి కొన్ని హామీలిచ్చారు. ఆ పనులను సైతం అప్పలరాజు చేయించలేకపోయారు. ః పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఐదేళ్లుగా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు జరగలేదు. ఇది పూర్తయితే పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 24 వేల ఎకరాలకు సాగునీరు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి తాగునీరందుతుంది.

తిత్లీ తుపాను ప్రభావంతో ఉద్దానం ప్రాంతంలో నష్టపోయిన రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం ఇచ్చింది తప్ప వైకాపా హయాంలో ఒక్క రూపాయి ఇవ్వలేదు.


వట్టిమాటగానే జెట్టీ

ప్రస్తుత పరిస్థితి: వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు- మంచినీళ్లపేట గ్రామాల మధ్య రూ.12 కోట్లతో జెట్టీ నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతం చుట్టూ ప్రహరీ నిర్మించి మధ్యలో కంకరతో చదును చేసి వదిలేశారు. మిగిలిన నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టకపోవడంతో మత్స్యకారులు ఉపాధి అవకాశాలు లేక వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చినా ఇప్పటికీ పూర్తి కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని